వరంగల్: వేపపుల్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల సూర్యపేట తండాలో ఆదివా రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండా కు చెందిన 3వ వార్డు సభ్యుడు ధారావత్ మైబు (42)కు ఎకరం పది గుంటల భూమి ఉంది. ఆదివా రం మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అనంతరం పళ్లపుల్ల(వేపపుల్ల) కోసం బావి దగ్గర ఉన్న వేప చెట్టు వద్దకు వెళ్లాడు. వేపపుల్ల తెంపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. అప్పటికే నీళ్లు అయిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలింది.
కాగా, ఉదయం చేను వద్దకు వెళ్లిన మైబు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెలక వద్దకు వెళ్లారు. బావి వద్ద చెప్పులు కనిపించడంతో బావిలోకి చూశారు. దీంతో జారి పడినట్లు గుర్తించారు. బయటికి తీసి చికిత్స కోసం నర్సంపేటలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, మృతి చెందినట్లు నిర్ధారించారు. మైబుకు భార్య సుజాత, కుమారుడు మధు, కూతురు హేమలత ఉన్నారు. కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment