ప్లాన్‌.. ఫ్లాప్‌ | way robbery flop driver arrest | Sakshi
Sakshi News home page

ప్లాన్‌.. ఫ్లాప్‌

Published Wed, Nov 8 2017 11:42 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

way robbery flop driver arrest - Sakshi

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అనురాధ

పక్కా ప్లాన్‌ వేశారు.. అనుకున్నట్టుగానే దారిదోపిడీకి వెంబడించారు.. అదునుచూసి స్కెచ్‌ వేసిన వ్యక్తిని దొరికించుకున్నారు.. ఉన్నకాడికి డబ్బులను దోచుకున్నారు.. పారిపోతూ చివరికి ఇట్టే పట్టుబడ్డారు. వారి ప్లాన్‌ను పోలీసులు పసిగట్టి ప్లాఫ్‌ చేయడంతో బాధితుడికి న్యాయం జరిగింది. దోపిడీ చేయాలనే ఆలోచన వచ్చింది ఎక్కడో ఉండే దారిదోపిడీ దొంగలకు కాదు.. సదరు వ్యక్తి వద్ద పనిచేసిన పాత డ్రైవర్‌కే.

మహబూబ్‌నగరక్రైం/జడ్చర్ల: అడ్డ దారిన సంపాదించాలనుకున్న కొంద రు దుండగులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎంత చలాకీగా వ్యవహరించి దోపిడీకి పాల్పడినా చివరకు పోలీసుల చక్రబంధనంతో ఇట్టే చిక్కారు. ఈ సంఘటన జడ్చర్ల కావేరమ్మపేట అర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సంఘటన జరిగిన  మూడు గంటల్లోనే పోలీసులు దొంగలను పట్టుకున్నారు. మంగళవారం ఎస్పీ అను రాధ తన కార్యాలయంలో దోపిడీకి సం బంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. 
 
నేరచరిత్ర ముఠాతో దోస్తీ..
హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన రామావత్‌ మోర్‌ వృత్తిరీత్యా సైకిల్‌ విడిభాగాల హోల్‌సేల్‌ వ్యాపారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని రిటైల్‌ వ్యాపారులకు విడిబాగాలను సరఫరా చేసి ప్రతీనెల వచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. వ్యాపారివద్ద సంతోష్‌ సుబాన్‌జీ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో మూడేళ్ల క్రితం యజమాని అతన్ని తొలగించాడు. అయితే సంతోష్‌ సోదరుడు అంబదాస్‌ సుభాన్‌జీ, అతని బంధువు వెంకటేశ్‌ బిలాదార్‌కు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగనోట్ల కేసులో నేరచరిత్ర కలిగి ఉన్న దినేష్‌ మాన్, గణేష్‌తో పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దారి దోపిడీలను వృత్తిగా ఎంచుకున్నారు. అందులో ఒకరిద్దరికి దారి దోపిడీలు చేసిన అనుభవం ఉంది.  

యజమాని నడవడిక ఆధారంగా స్కెచ్‌  
సైకిల్‌ విడిభాగాల వ్యాపారి రామావత్‌ను టార్కెట్‌ చేయడానికి అతని పాత డ్రైవర్‌ సంతోష్‌ తన బృందానికి చెప్పాడు. ప్రతీనెలా ఆయన ఎక్కడెక్కడకు వెళ్తాడు.. ఎంతెంత డబ్బులు వసూలు చేస్తాడు.. ఎక్కడెక్కడ ఆగుతాడనే పూర్తి వివరాలను సేకరించి దోపిడీ చేయాలని స్కెచ్‌ వేశారు. వెంకటేశ్‌కు చెందిన క్వాలిస్‌ (టీఎస్‌ 12 ఈఈ 6736)తో పాటు ఓ బైక్‌పై సోమవారం ఉదయం నుంచే రామావత్‌ మోర్‌ కారును వెంబడించారు. జడ్చర్ల నుంచి వనపర్తికి వెళ్లిన సమయంలో అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బైక్‌ను పార్క్‌ చేసి పెబ్బేర్‌ వెళ్లే రహదారిలో ఉన్న ఓ దుకాణంలో రెండు కత్తులను కొనుగోలు చేశారు. క్వాలిస్‌లో వెళ్లడానికి కుదరక పోవడంతో బైక్‌పై వెళ్లి పని పూర్తిచేసేలా వ్యూహం రచించారు. కానీ బైక్‌ అవసరం లేక వనపర్తిలోనే ఉంచారు. రామావత్‌ కర్నూల్‌ వెళ్లిన తర్వాత డబ్బు పెద్దమొత్తంలో వసూలయ్యాక దోపిడీ చేయాలనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే వ్యాపారి కలెక్షన్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు.  

ఆందోళన కలిగిస్తున్న దోపిడీలు
జాతీయ రహదారిపై ప్రయాణమంటే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలతో పాటు దొంగతనాలు, దోపిడీలకు ఈ రహదారి కేరాఫ్‌గా మారడంతో ప్ర యాణికులు భయపడుతున్నారు. డబ్బులు దోచుకోవడానికి దుం డగులు హత్యలు చేయ డానికి సైతం వెనకాడటం లేదు. చాలామంది కిడ్నాప్‌లు, దోపిడీలు చేయడానికి జాతీయ రహదారినే ఎం చుకోవడం సర్వత్రా కలవరపాటుకు గురిచేసింది.

కత్తులతో బెదిరించి...
కారు వెంబడించిన దొంగల ముఠా వ్యాపారి ఎక్కడ వాహనం దిగుతాడోనని అదును కోసం వేచిచూశారు. అంతలోనే జడ్చర్ల అతిథిగృహం వద్ద రామావత్‌ మూత్ర విసర్జనకు కారు ఆపాడు. ఇదే చాన్స్‌ అనుకుని వెంటనే క్వాలిస్‌లో వచ్చిన దుండగులు కత్తులతో బెదిరిస్తూ అతని వద్దనున్న రూ.3.84 లక్షల క్యాష్‌ బ్యాగ్‌తో పాటు కారును కూడా తీసుకుని హైదరాబాద్‌ వైపు పారిపోయాడు. పాత డ్రైవర్‌ సంతోష్‌ తన పాత యజమాని ఎక్కడ గుర్తిస్తాడోనన్న అనుమానంతో క్వాలిస్‌లోనే ఉండిపోయాడు. వారు అలా వెళ్లేసరికి వ్యాపారి వెంటనే జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు జాతీయ రహదారితో పాటు ఇతర రోడ్లపై తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అనురాధకు సమాచారం ఇవ్వగా ఆమె కూడా హుటాహుటిన జడ్చర్లకు చేరుకుని తనిఖీల్లో పాల్గొన్నారు. గొల్లపల్లి సమీపంలో కారును వదిలి అంతా క్వాలిస్‌లో కల్వకుర్తి వైపు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.  

దోపిడీ రెండోసారి..
సారి కర్ణాటక రాష్ట్రంలో డబ్బు వసూలు చేసుకుని వస్తుండగా దో పి డీ చేయించాడు. ఈ ఘటనలో సంతోష్‌ నేరుగా పాల్గొనకపోయినా జ డ్చర్ల దగ్గర జరిగిన సంఘటనలో నేరుగా పాల్గొని పట్టుబడ్డాడు.  

సొత్తు స్వాధీనం.. దుండగుల అరెస్ట్‌
దొంగలను అరెస్ట్‌ చేసిన అనంతరం వారి నుంచి క్వాలిస్, షిఫ్ట్‌ కారుతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, రూ.3.84లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్పీ అనురాధ తన కార్యాలయంలో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. అలాగే, కేసును ఛేదించిన మిడ్జిల్‌ ఎస్‌ఐ సైదులు, ఏఎస్‌ఐ జహంగీర్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రాజు, విష్ణులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ భాస్కర్, జడ్చర్ల సీఐ బాలరాజు పాల్గొన్నారు.

 గతంలో జరిగిన సంఘటనలు కొన్ని..
ఇదే రహదారిపై పోలేపల్లి సెజ్‌ సమీపంలో మూడేళ్ల క్రితం డబ్బుల కోసం లారీలను ఆపి దోపిడీకి పాల్పడడడమే కాక లారీ డ్రైవర్‌ను తుపాకీతో కాల్చిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.  
దశాబ్ధం క్రితం ఇదే రహదారిపై కుక్కల రాజు అనే ఘరానా దోపిడీదారుడు తన ముఠాతో జడ్చర్ల సమీపంలో హైటెక్‌ బస్సును దోచుకున్నాడు.  
2010లో మల్లెబోయిన్‌పల్లి సమీపంలో జాతీయరహదారిపై లారీని ఆపి కొందరు దోపిడీకి పాల్పడ్డారు.  
2011 అక్టోబర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చి సెజ్‌ దగ్గర జాతీయరహదారి పక్కనే పెట్రోల్‌ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు.  
మత ప్రచారకుడు కే.ఏ.పాల్‌ సోదరుడు డేవిడ్‌ రాజును కూడా అడ్డాకుల సమీపంలో జాతీయ రహదారి పక్కనే హత్య చేశారు.  
ఆగిఉన్న వాహనాల నుంచి డీజిల్‌ దొంగిలించిన సంఘటనలైతే లెక్కకు మించి చోటు చేసుకుంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement