నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు
పత్తికొండ టౌన్:మానవ సంబంధాలు మంటగలసిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కుట్ర పన్ని అంతమొందించింది ఓ మహిళ. గత నెల 10న తుగ్గలి మండలం మీటేతండా సమీపంలో పొత్తూరు కమ్మ నారాయణస్వామి(55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణలో భార్యే కుట్రపన్ని చంపేసినట్లు పోలీసులు తేల్చారు. ఈమేరకు భార్యతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పత్తికొండలో సీఐ బివి.విక్రంసింహ, పత్తికొండ, జొన్నగిరి ఎస్‌ఐలు శ్రీనివాసులు, నజీర్‌అహ్మద్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. పత్తికొండ మండలం రామచంద్రాపురం కొట్టాల గ్రామానికి చెందిన పొత్తూరు కమ్మ నారాయణస్వామికి, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పెద్ద చిన్న ప్యాపిలి(పీసీ ప్యాపిలి)కి చెందిన ఉమాదేవితో 1997లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నారాయణస్వామికి వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించేవాడు. భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గ్రామంలో బంధువుల మధ్య పరువు పోతుందని పత్తికొండకు మకాం మార్చాడు. తర్వాత గుంతకల్లులో నివాసముండేవారు. భార్య మద్దికెర మండలం బురుజులకు చెందిన ఎర్రిస్వామితో సన్నిహితంగా ఉండేది. ఈక్రమంలో నారాయణస్వామి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. రెండేళ్ల క్రితం అతడికి దీర్ఘకాలిక వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఆమె అతడిని శారీరకంగా దూరంగా ఉంచడంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. తనకు పరిచయమున్న వన్నూర్‌స్వామి అనే మంత్రగాడితో ఆమె తన సమస్యను చెప్పుకుంది. అతడి సలహా మేరకు భర్త హత్య చేయించేందుకు తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రాజశేఖర్‌తో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుంది.
హత్య చేసేందుకు గోవా టూర్‌కు..
ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం ఆమె తన భర్తను రాజశేఖర్ వెంట మార్చి 4న రైలులో గోవా టూర్‌కు పంపింది. హుబ్లి సమీపంలో మద్యం మత్తులో ఉన్న నారాయణస్వామిని టవల్‌తో గొంతు నులిమి చంపేందుకు రాజశేఖర్ యత్నించాడు. మత్తులో ఉన్న ఆయన ఒక పక్కకు ఒరిగిపోవడంతో చనిపోయాడని భావించిన రాజశేఖర్ అక్కడ నుంచి పారిపోయి గుంతకల్లుకు వచ్చాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన నారాయణస్వామి మళ్లీ తిరిగివచ్చి రాజశేఖర్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్‌కు ఫోన్ చేసి ‘నా భర్త నీకోసం వెదుకుతున్నాడు, నువ్వు చంపకపోతే ఆయన చేతిలో చస్తావు’ అని పలుసార్లు బెదిరించింది. తనను ఎక్కడ చంపుతారో అని భయపడిన రాజశేఖర్.. నారాయణస్వామిని చంపాలని నిశ్చయించుకున్నాడు.
బైక్‌ను వెంబడించి..
ఎలాగైనా నారాయణస్వామిని హత్య చేయాలనుక్ను రాజశేఖర్ ఇందుకు తన సోదరుడు అనంతపురం జిల్లా తోపుదుర్తిలో జీపుడ్రైవర్‌గా ఉంటున్న సుధాకర్, అదే జిల్లా తగరకుంటకు చెందిన ఆటోడ్రైవర్ బాలునాయక్ సాయం కోరాడు. ఉమాదేవి సమాచారం మేరకు..గత నెల 9న గుంతకల్లు నుంచి ప్యాపిలి వెళ్తున్న నారాయణస్వామిని ముగ్గురూ బైక్‌పై వెంబండించారు. గత నెల 10 తెల్లవారుజామున బోడబండ పక్కీరప్ప ఆలయానికి వెళ్లి వస్తున్న నారాయణస్వామిని మీటేతండా సమీపంలో గొంతుకు టవల్ బిగించి హత్యచేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా నమ్మించేందుకు మృతుడి పక్కనే బైక్‌ను పడవేసి అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, నిందితుల ఫోన్ డేటా ఆధారంగా హత్యకేసుగా తేల్చారు. ఈమేరకు నిందితులు ఉమాదేవి, వన్నూర్‌స్వామి, రాజశేఖర్, సుధాకర్, బాలునాయక్‌లను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment