మృతుడు గోపి శరీరంపై గాయాలు
మీర్‌పేట: వివాహేతర సంబంధం బయటపడిందని ఓ మహిళ ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో ఉన్న భర్తను హత్య చేయడమేగాక సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సంఘటన సోమవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, పోర్లగడ్డతండాకు చెందిన వడ్త్యా గోపి (35) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నాగోలు అల్కాపురిలో ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ అల్కాపురిలో బిల్డింగ్ మెటీరియల్ విక్రయించే వీరాస్వామి వద్ద పని చేసేవారు. ఈ క్రమంలోనే వీరాస్వామి లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని గుర్తించిన గోపి మూడు నెలల క్రితం అక్కడ పని మానేసి కర్మన్‌ఘాట్ భూపేష్‌గుప్తానగర్‌కు మకాం మార్చాడు.
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా వీరాస్వామి గతంలో వేసిన చీటీ డబ్బుల కోసం గోపి ఆదివారం అక్కడికి వెళ్లగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వీరాస్వామి తన స్నేహితుడు రాములుతో కలిసి గోపిపై దాడి చేశాడు. దీనిని అవమానంగా భావించిన గోపి అదే రోజు రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చి వీరాస్వామితో కలిసి తనను చంపేందుకు పథకం పన్నావంటూ భార్యతో గొడవకు దిగాడు. అనంతరం నిద్రమత్తులో ఉన్న గోపిని కడతేర్చేందుకు నిర్ణయించుకున్న లక్ష్మి గొడవ విషయాన్ని వీరాస్వామికి ఫోన్ చేసి చెప్పి అతడిని ఇంటికి పిలిపించింది. స్నేహితుడు రాములుతో కలిసి అక్కడికి వచ్చిన వీరాస్వామి లక్ష్మితో కలిసి గోపి గొంతు నులిమి ముఖం, ఛాతిపై పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్న గోపి తండ్రి బద్యా చంద్రుకు ఫోన్ చేసి గోపి గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పింది. అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు గోపి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పోర్లగడ్డతండాకు తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన బంధువులు శరీరంపై తీవ్ర గాయాలు, గొంతు కమిలిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హత్యగా నిర్ధారించారు. దీంతో నిందితులు లక్ష్మి, వీరాస్వామి, రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment