అంతా నిజమే చెప్పారు... | Witnes Tells All True in Bomb Blasts Case Hyderabad | Sakshi
Sakshi News home page

అంతా నిజమే చెప్పారు...

Published Thu, Sep 13 2018 8:49 AM | Last Updated on Thu, Sep 13 2018 8:49 AM

Witnes Tells All True in Bomb Blasts Case Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబందిత, కుట్ర కేసుల విచారణలో ఇతర ఆధారాలతో పాటు సాక్షులకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అనేక కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సాక్షులు ఎదురు తిరిగిన (హోస్టైల్‌ కావడం) కారణంగా ఆ కేసులు వీగిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది న్యాయస్థానం కొట్టి వేసిన మక్కా మసీదులో బాంబు పేలుడు కేసే ఇందుకు తాజా ఉదాహరణ. అయితే జంట పేలుళ్ల కేసులో సాక్షులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. సోమవారం తీర్పు వెలువడిన 2007 నాటి జంట పేలుళ్ల కేసుల్లో 286 మంది సాక్షులు ఉండగా, అందులో ఏ ఒక్కరూ ఎదురు తిరగలేదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తామంతా ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూ చాటారు. నాడు చూసింది చూసినట్లు చెప్పడంలో ఏ మాత్రం వెనుకాడలేదు. ఫలితంగానే అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఇద్దరికి ఉరి, మరొకరికి జీవితఖైదు పడింది. నిందితుల్లో ఒకరైన ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌ను నిర్ధోషిగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని ప్రాసిక్యూషన్‌ నిర్ణయించింది. 2007 ఆగస్టు 25న జరిగిన జంట పేలుళ్లకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతాలపై ప్రాథమికంగా సైఫాబాద్, సుల్తాన్‌బజార్, మలక్‌పేట ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాద సంబందిత కేసులు కావడంతో వీటిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) బదిలీ చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ జంట పేలుళ్ల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్‌కు తొలినాళ్లల్లో నిఘా, ఆపరేషన్స్, దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ పోలీసుస్టేషన్‌ హోదా ఇచ్చారు. దీంతో సిట్‌ నుంచి ఈ మూడూ ఆక్టోపస్‌కు వెళ్లాయి. కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఆక్టోపస్‌ అధికారులు 2009 మే, జూన్‌ నెలలో మూడు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇది జరిగిన ఏడాది కాలానికే ఆక్టోపస్‌ను కేవలం కమాండో ఫోర్స్‌గా మార్చిన ప్రభుత్వం పోలీసు స్టేషన్‌ హోదాను ఉగ్రవాద వ్యతిరేక విభాగమైన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ) సెల్‌కు కట్టబెట్టింది. దీంతో ఈ కేసులు సీఐ సెల్‌కు బదిలీ అయ్యాయి. కేసు విచారణ మొత్తం వీరి పర్యవేక్షణలోనే సాగింది. గత కొన్ని నెలలుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసులను విచారించారు. అప్పట్లో లుంబినీపార్క్‌లో జరిగిన పేలుడులో మృతులు, క్షతగాత్రుల్లో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు. ఈ 11 ఏళ్లల్లో వారు చదువు పూర్తి చేసుకోవడంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

వారి వివరాలన్నీ సేకరించిన దర్యాప్తు అధికారులు వాయిదాలకు తీసుకురావడం, వచ్చేలా వారిని ఒప్పించడం, బ్రీఫింగ్‌ ఇప్పించడం, సాక్ష్యం చెప్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు కేసుల్లో అత్యధికులు స్థానికులే సాక్షులుగా ఉన్నారు. ఆద్యంతం ఎక్కడా సాక్షుల వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారికి భరోసాను వారికి కల్పించి కోర్టు వరకు వచ్చేలా చేశారు. ఫలితంగానే ఈ నేరంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులకు ఉరి శిక్ష పడింది. సాక్ష్యం చెప్పిన 286 మందిలో ఓ ఉగ్రవాది బంధువు కూడా ఉండటం, ఆయన సైతం తన బంధువుతో పాటు ఇతర టెర్రరిస్టులకూ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం. మరోపక్క అభియోగాలు వీగిపోయిన ఇద్దరిలో సాదిఖ్‌పై ఇక్కడి కేసుల్లో సరైన సాక్షాలు లేవని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే ఫారూఖ్‌కు సంబంధించి మాత్రం నేరం నిరూపించగలమని, ఈ నేపథ్యంలోనే పై కోర్టులో తీర్పును సవాల్‌ చేస్తామని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో జీవితఖైదు పడిన తారీఖ్‌ అంజుమ్‌ హసన్‌ పాత్ర పరిమితమని ఆ శిక్ష సమంజసమే అని పేర్కొంటున్నారు.

ఇదీ కేసుల్లో సాక్షుల సంఖ్య...
కేసు                            సాక్షులు
గోకుల్‌చాట్‌ పేలుడు            147
లుంబినీపార్క్‌ పేలుడు         93
దిల్‌షుక్‌నగర్‌ పేలని బాంబు  46  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement