సాక్షి, న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఉపాధి కోసం ఏడాది కిందట సౌదీకి వచ్చానని ఆమె వీడియోలో తెలిపారు. ఈ నరకకూపం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
'భగవంత్ మాన్ సాబ్ దయచేసి నాకు సాయం చేయండి. నేను ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా. ఎంతో వేదనలో ఉన్నా. గత ఏడాదిగా నన్ను హింసిస్తున్నారు. మీరు హోషియార్‌పూర్ యువతిని కాపాడారు. నన్ను కూడా కాపాడండి. నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను. నాకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ కన్నీళ్లు రాలుస్తూ దీనంగా ఆమె వీడియోలో విజ్ఞప్తి చేసింది. సౌదీ పోలీసులు కూడా తనకు సాయం చేయడం లేదని పేర్కొంది. తన యజమాని తనను ఓ గదిలో బంధించి శారీరకంగా హింసిస్తున్నాడని, కొన్నిరోజులుగా తనకు ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆమె తన దీనగాథను వివరించింది. సాయం కోసం పోలీసుల వద్దకు వెళితే.. వాళ్లు తనను తన్ని.. మళ్లీ ఆ ఇంట్లోకి తరిమేశారని తెలిపింది. 20-22 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఆమె తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని, తన తల్లి బాగా లేదని, ఆమెను వెంటనే చూసేందుకు తాను స్వదేశం వచ్చేలా సాయం చేయాలని వేడుకుంది. పంజాబీలు ఎవరూ సౌదీ అరేబియాకు రావొద్దని, ఇక్కడి వారు పెద్ద మూర్ఖులని ఆమె పేర్కొంది. ఆమె దీన వీడియోపై ఎంపీ భగవంత్ మాన్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment