సిద్ధూ.. మాకు వద్దేవద్దు!
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గూగ్లీతో బీజేపీని చిత్తుచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంకల్పించింది. కానీ, క్షేత్రస్థాయిలోని ఆప్ శ్రేణులు మాత్రం సిద్ధూ రాక పార్టీకి బౌన్సర్‌లా తగిలే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ క్రికెటర్, మంచి వక్త అయిన సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసి ఆప్‍లో చేరుతారని, ఆయనను ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ కథనాలను ఆప్ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదట. పార్టీలోకి సిద్ధూ రాకపై క్షేత్రస్థాయిలో ఆప్ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. మొత్తం పంజాబ్‌లోని 26 చోట్ల ఈ అంతర్గత సర్వేను పార్టీ చేపట్టింది. ఆప్‌లోకి సిద్ధూ రాకపై ఈ సర్వేలో మెజారిటీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సిద్ధూ వస్తే తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని కూడా కొందరు పేర్కొన్నట్టు సమాచారం. ఈ సర్వే ఫలితాలను ఆప్ పంజాబ్ నాయకులు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. ఈ సర్వే ఫలితాల నేపథ్యంలో సిద్ధూ చేరికపై కేజ్రీవాల్ ఆచితూచి నిర్ణయం తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది.
ప్రధానంగా హిందూత్వవాదిగా పేరొందిన సిద్ధూను లౌకిక పార్టీ అయిన ఆప్‍లోకి ఎలా తీసుకుంటారని ఆ పార్టీ నేతలు, శ్రేణులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. సిద్ధూ చేరిక కథనాలపై పంజాబ్ ఆప్ చీఫ్ కన్వర్ సంధూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిద్ధూ ఆప్‌లో చేరినపక్షంలో ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని సంధూ పేర్కొన్నారు. రాజ్యసభకు సిద్ధూ రాజీనామాను ఆప్ అధినేత కేజ్రీవాల్ తదితరులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే, ఆప్‌లో చేరేవిషయంలో సిద్ధూ మౌనంగా ఉండటంతో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.