పంజాబ్‌కు దూరం చేసే కుట్ర
అందుకే బీజేపీకి దూరమయ్యా: సిద్ధూ
న్యూఢిల్లీ : పంజాబ్ రాజకీయాల నుంచి దూరం చేసేందుకు బీజేపీ తనపై కుట్ర పన్నిందని, అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారం తర్వాత ఆయన మౌనం వీడారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. మాతృభూమి కంటే ఏ పార్టీ, ఏ పదవీ తనకు గొప్పది కాదన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వలేదు. పంజాబ్ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని, దానికి ఎవరైతే కట్టుబడతారో అక్కడికి వెళ్తానని చెప్పారు.
పంజాబ్ కోసం తాను ఎలాంటి కష్టనష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ‘అకాలీదళ్ ఒత్తిడి మేరకు పంజాబ్‌కు నన్ను దూరం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.నాలుగు సార్లు ఇలాంటి ప్రయత్నం చేయడంతో సహించడం నా వల్ల కాలేదు. నా మూలాలు పంజాబ్‌లోనే ఉన్నాయి. అమృతసర్‌ను వదలి ఎలా వెళ్తాను? నా తప్పేంటి? గత ఎన్నికల్లో కూడా కురుక్షేత్ర, పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయమంటే అంగీకరించలేదు. నా ప్రజలను మోసం చేయలేనని చెప్పాను’ అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నలకు పంజాబ్ ప్రయోజనాలు ఎక్కడ నెరవేరితే అక్కడ ఉంటానన్నారు.