ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్
రోజూ మద్యం తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న భర్త వేధింపులు తాళలేక విజయనగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా...బలిజిపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దుర్వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం, బొబ్బిలి: బలిజిపేట మండల కేంద్రానికి చెందిన పి.శ్రీకాంత్(20) అనే యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి క్రిమి సంహారక మందు తాగడంతో స్థానికులు అక్కడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఏ పనులు చేయకుండా ఉండటంతో పాటు దుర్వ్యసనాలకు అలవాటు పడటంతో ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారన్న ఉక్రోషంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు సూర్యనారాయణ, సత్యవతి బోరున విలపిస్తున్నారు. బలిజిపేట ఎస్‌ఐ సింహాచలం కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భర్త వేధింపులు తాళలేక...
విజయనగరం టౌన్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని ఉడాకాలనీలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు...
స్థానిక ఉడాకాలనీ ఫేజ్–3 ఆంజనేయ స్వామి గుడి వద్ద నివాసముంటున్న అద్దెపల్లి రమాదేవి (27) భర్త ఎవిఎస్.రాజుతో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకట్ చరణ్ అనే బాబు ఉన్నాడు. స్థానిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా రాజు నిత్యం మద్యం సేవించి, ఇంటికి వచ్చి భార్య రమాదేవిని దుర్భాషలాడడం, కొట్టడం, తిట్టడం వంటివి చేస్తూ ఇబ్బందులు పెడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం భార్యను వేధించసాగాడు. అనంతరం కొడుకును పాఠశాలకు తీసుకెళ్లి, ఇంటికి వచ్చి చూడగా ఆమె ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకుందని గ్రహించాడు. రాజు సమీపంలో ఉన్న వారి సాయంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారని పోలీసులకు తెలిపాడు. గతంలో రాజుకు ఇద్దరు భార్యలుండేవారు. వారు సహజ మరణం చెందడంతో పెద్దల సమక్షంలోనే మూడో భార్యగా రమాదేవిని చేసుకున్నాడు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment