
బంగారం అపహరించిన నిందితురాలు సురేఖ, పక్కన స్వాధీనం చేసుకున్న నగలు
విజయవాడ: మత్తు బిళ్లలు ఇచ్చి బంగారం దొంగతనానికి పాల్పడే నిందితురాలని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి 112 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒన్‌టౌన్ శివాలయం ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితురాలు గుంటూరు జిల్లా రాజాగారి తోటకు చెందిన పాతిన సురేఖ అలియాస్ బుజ్జి (33) విచారణలో తేలింది. టైలరింగ్ పని చేస్తున్న ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు.
భార్యాభర్తలిద్దరికి పనులు దొరకడం లేదు. దీనికి తోడు తేలికంగా డబ్బు సంపాదించాలనే అతి ఆశతో 15 రోజుల క్రితం ఆమె విజయవాడకు చేరింది. విజయవాడ బస్టాండ్ వద్ద వృద్ధురాలిని మాటలు చెప్పి, ఆటో ఎక్కించుకుని బందర్ రోడ్డులో ఆయుర్వేద హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. మంచి మందులు ఇప్పిస్తానని నమ్మబలికి తేనెలో కలిపిన మత్తు బిళ్లలు వృద్ధురాలితో మింగించింది. తరువాత బంగారం వస్తువులను అపహరించుకుపోయింది. ఈ క్రమంలో గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు మేరకు సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి నిందితురాలిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment