
సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరమ్మ
కడప రూరల్ : నమ్మించి వివాహం చేసుకున్న తరువాత తన భర్త తనను మోసగించాడని కడప నగరానికి చెందిన ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్ల బోసుకున్నారు. స్థానిక ఒక హాస్పిటల్‌లో చెన్నూరుకు చెందిన యు. రవికుమార్ కాంపౌండర్‌గా, తాను స్వీపర్‌గా పని చేస్తుండే వారిమని తెలిపారు. తమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నామని చెప్పారు.
తరువాత అతను తనను వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు తనకు 18 నెలల కుమారుడు ఉన్నాడని తెలిపారు. ఈ విషయమై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. అనంతరం ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాసులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డెన్న మాట్లాడుతూ గిరిజన మహిళకు అన్యాయం జరగడం దారుణమన్నారు. న్యాయం కోసం కలెక్టర్ బాబూరావునాయుడును కలిసి వినతి పత్రం సమర్పించామని వివరించారు. ఈశ్వరమ్మకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment