
ఘటనా స్థలంలో మృతదేహం
టెక్కలి రూరల్: టెక్కలికి కూతవేటు దూరంలో మహిళ హత్యకు గురైంది. జనసంచారం లేని రహదారికి పక్కగా ఉన్న తోటల్లో వివాహిత మృతదేహాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో అలజడి చెలరేగింది. మృతురాలు సారవకోట మండలం రామకృష్ణపురం పంచాయతీ పరిధి చరణ్ దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి(39)గా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంధువుల ఇంటికి వెళతానని..
పోలాకి మండలంలోని ప్రియాగ్రహారానికి చెందిన లక్ష్మణరావుతో సారవకోట మండలంలోని చరణ్‌దాసుపురానికి చెందిన నీలవేణితో వివాహమైంది. వీరికి చిన్నారావు, సోదులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణరావు ప్రైవేట్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే వీరు బతుకుదెరువు కోసం చరణ్‌దాస్‌పురం వచ్చి జీవిస్తున్నారు. పోలాకి మండలం ప్రియాగ్రహారంలోని బంధువుల ఇంటికి నీలవేణి ఆదివారం వెళ్లింది.
సాయంత్రం చరణ్‌దాస్‌పురం బయలుదేరింది. చీకటి పడిపోవడంతో భర్త లక్ష్మణరావుకి ఫోన్ చేసింది. తాను కొత్తపేటలో ఉన్నానని, కురుడు గ్రామానికి ద్విచక్రవాహనంపై రావాలని సూచించింది. అమె చెప్పినట్లుగా లక్ష్మ ణరావు కురుడు వచ్చి నీలవేణికి ఫోన్ చేశారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు రావడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సమీపంలోని కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.
సారవకోట మండలం కనుక.. అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. రాత్రంతా లక్ష్మణరావుతో పాటు బంధువులు ఆమె కోసం గాలించారు. సోమవారం ఉదయం సారవకోటలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లబోతున్న సమయంలో.. టెక్కలి జీడితోటలో వివాహిత మృతదేహం ఉందని తెలిసింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న లక్ష్మణరావు.. మృతదేహాన్ని పరిశీలించి తన భార్య నీలవేణిగా గుర్తించారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే?
కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. టెక్కలి, కాశీబు గ్గ రూరల్ సీఐలు శ్రీనివాసరావు, తాతారావు, ఎస్‌ఐ–2 రమణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలో రక్తంతో నిండి ఉన్న పెద్ద రాయి, పగిలిన బీరు సీసాలు, కారం పొడి ప్యాకెట్టు, జేబు రూమాల్, సెల్‌ఫోన్ తదితర వస్తువులు పడి ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొత్తపేట జంక్షన్ నుంచి కురుడు వైపు వెళ్లాల్సిన అమె పోలవరం వైపు రావడంతో పాటు మృతదేహంపై కారం చల్లడం చూసిన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు వాసన గుర్తుపట్టకుండానే కారం చల్లారని, ప్రణాళిక ప్రకారమే చేశారని భావిస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువు టొంపర యర్రయ్య ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలవరం, లింగాలవలస సమీపంలోని ఈ తోట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గతంలో ఇక్కడ పలు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతుండగా గ్రామస్తులు మందలించిన ఘటనలు ఉన్నాయి. నిత్యం మద్యం తాగుతూ అనేక మంది కనిపిస్తుంటారని తెలిపారు.
సారవకోట: మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీలోని చరణ్‌దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి టెక్కలి మండలంలో హత్యకు గురైందని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment