
సాక్షి, బెంగళూరు : భర్త పెడుతున్న వరకట్న వేధింపులు తాళలేక ముగ్గురు చిన్నారులతో సహా ఓ మహిళ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రాయచూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల మేరకు.. దేవదుర్గ తాలూకాకు చెందిన నసీమా (28), ముగ్గురు చిన్నారి కొడుకులు మహ్మద్ హనీఫ్(5), అయాన్ (3), రిగాన్ (1)లతో కలిసి కొత్తదొడ్డి వద్ద నారాయణపుర కుడి కాలువలో దూకి తనువు చాలించింది. అదనంగా కట్నం తీసుకుని రావాలంటూ ప్రతి రోజు భర్త చిత్ర హింసలకు గురిచేస్తుండడంతో జీవితం మీద విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. దేవదుర్గ తాలూకా దేవతగల్‌కు చెందిన నసీమాకు ఏడేళ్ల క్రితం సిరివార తాలూకా అత్తనూరుకు చెందిన మహ్మద్ మహబూబ్‌తో వివాహమైంది. ఇతడు చిన్నకారు రైతు.
అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులు
ప్రతి రోజు ఇంటిలో భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం తేవాలంటూ నసీమాను హింసించేవారు. ఇలాగే వేధించి మంగళవారం రాత్రి నసీమా, ముగ్గురు పిల్లలను ఇంటి నుంచి బయటికి తోసివేశారు. ఈ బాధలు భరించలేక దేవతగల్ నుంచి కొత్తదొడ్డి వద్దకు చేరుకుని అక్కడ నారాయణపుర ప్రధాన కుడి కాలువలోకి దూకింది. బుధవారం ఉదయం కాలువలో మృతదేహాలను గమనించిన కొందరు సిరివార పోలీసులకు సమాచారం అందించగా వచ్చి పరిశీలించారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. భర్త, అత్తమామలే హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment