
నాగలక్ష్మి మృతదేహం
మల్కాజిగిరి: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌హెచ్‌ఓ కొమరయ్య కథనం ప్రకారం..గుంటూరు జిల్లా, రాజుపాలెంకు చెందిన పెమ్మ రమేష్, నాగలక్ష్మి దంపతులు సాయినగర్ గ్రీన్‌గోల్డ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వారికి కుమార్తె మోక్షాంజలి(4) ఉంది. సోమవారం తెల్లవారుజామున నాగలక్ష్మి అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం అందడంతో డీసీసీ ఉమామహేశ్వరరావు, ఏసీపీ సందీప్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
అనుమానాలెన్నో.. నాగలక్ష్మి పడివున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు అంతస్తులపై నుంచి కిందకు దూకినా అమె ఒంటిపై ఎక్కడా గాయాలు లేవు. ఆదివారం రమేష్, నాగలక్ష్మి మ్యారేజ్ డే సందర్భంగా జూబ్లిహిల్స్‌లోని జగన్నాథస్వామి గుడికి వెళ్లి వచ్చామని, మధ్యాహ్నం అమీర్‌పేటలో కంప్యూటర్ కోర్సు వెళ్లి వచ్చి రాత్రి ఇంట్లోనే భోజనం చేసి నిద్రపోయామని మృతురాలి భర్త రమేష్ తెలిపాడు. సోమవారం తెల్లవారుజామున తనకు మెలుకువ వచ్చి చూసే సరికి నాగలక్ష్మి కనిపించకపోవడంతో బయటకు రావడానికి ప్రయత్నించగా బయట గడియపెట్టి ఉండటంతో పక్క ప్లాట్‌లో ఉంటున్న వారికి ఫోన్ చేస్తే వారు గొళ్లెం తీసారన్నారు. సెక్యూరిటీ గార్డు సహాయంతో గాలించగా కిందపడి ఉన్న నాగలక్ష్మిని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించానన్నాడు. కాగా తమ మథ్య ఎలాంటి గొడవలు లేవని, ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా లేవని రమేష్ పేర్కొన్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాన్ని రప్పించడంతో జాగిలం నేరుగా అపార్ట్‌మెంట్ డాబా పైకి వెళ్లి నేరుగా నాగలక్ష్మి మృతదేహం వరకు వచ్చి ఆగిపోయింది. జాగిలం పైకి వెళ్లినప్పుడు నాగలక్ష్మి చున్నీని గుర్తించింది. నాగలక్ష్మి ఎడమ కాలి మడమ వద్ద,వెన్నుముక కింది భాగం(పెల్విక్) వద్ద గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
అనుమానాలున్నాయి : నాగలక్ష్మి తల్లితండ్రులు
తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని నాగలక్ష్మి తండ్రి అచ్చయ్య, తల్లి కృష్ణకుమారి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా నాగలక్ష్మి ఫోన్ చేసిందని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. నాగలక్ష్మి కుమార్తె మోక్షాంజలిని తల్లి మృతదేహం వద్దకు తీసుకెళ్లగా అమ్మ పడుకుందా అని అడగడం అందరినీ కదిలించింది. తమ కుమార్తె మృతిపై పూర్తి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్‌హెచ్‌ఓ కొమురయ్య మాట్లాడుతూ నాగలక్ష్మి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment