సాక్షి, న్యూఢిల్లీ : ఎవరైనా కారు నుంచి చెత్తా చెదారాన్ని పడేస్తూ వెళతారు. కరెన్సీ నోట్లను పడేస్తూ వెళ్లరుగదా! ఇందుకు విరుద్ధంగా ఓ 50 ఏళ్ల మహిళ కారులో నుంచి కరెన్సీ నోట్లను పడేస్తూ వెళ్లింది. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, అలా 11 చోట్ల కరెన్సీ నోట్లను పడేస్తూ వెళ్లింది. జనం వాటిని ఎదురుకోవడానికి వీలుగా పార్కింగ్ లాట్‌లో మరి ఎక్కువ కరెన్సీ నోట్లను వేస్తూ వెళ్లింది. ఆ కరెన్సీ నోట్లను ట్రాఫిక్ పోలీసులతో పాటు బాటసారులు కూడా ఏరారు. ‘ఎవరు మాత్రం కరెన్సీ నోట్లను అసలు విసురుతారు. దొంగలిచ్చిన సొమ్ము కావచ్చు’ అనుకున్న బాటసారులు ఎక్కువ మంది వాటిని తెచ్చి పోలీసులకు అందజేశారు.
అలా పోలీసుల వద్దకు భారతీయ కరెన్సీలో 9 లక్షల రూపాయలు చేరింది. ఈ సంఘటన దక్షిణ కొరియాలోని డాగు అనే నగరంలో జూలై 19వ తేదీన ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగింది. సీసీటీవీ కెమేరాలు, రోడ్డుపై వెళుతున్న కారుల్లోని బ్లాక్ బాక్సుల ఆధారంగా ఆ కారును డ్రైవ్ చేస్తూ వెళ్లింది ఎవరో దక్షిణ కొరియా పోలీసులు గుర్తించారు. సియోల్ నగరం నుంచి ఇటీవలనే డాగా నగరానికి మకాం మార్చిన ఓ 50 ఏళ్ల మహిళ ఆ రోజున కారులో వెళుతూ డబ్బును రోడ్లపై విసిరారని తెలుసుకున్నారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంట్లో ఆమె తల్లి మాత్రమే ఉంది.
ఆమెను విషయం గురించి ప్రశ్నించగా, అంత డబ్బు ఎందుకు తీసుకెళుతున్నావంటూ తాను తన కూతురును ప్రశ్నించగా, ప్రజలకు పంచాలంటూ వెళ్లిందని చెప్పారు. అంతకుమించి తనకేమీ తెలియదని అన్నారు. సియోల్‌లో తాను ఇంతకాలం ఉన్న సొంతింటిని లీజ్‌కు ఇవ్వడం ద్వారా ఆ యువతికి ఆ సొమ్ము వచ్చిందని పోలీసులు తెలుసుకున్నారు. త్వరలోనే కేసును పూర్తిచేసి ఆమె సొమ్ము ఆమెకు ఇచ్చేస్తామని పోలీసులు తెలిపారు. ఆమె పేరును మాత్రం వారు వెల్లడించలేదు. అయితే ఆమె కారులో నుంచి డబ్బులు విసురుతూ వెళుతున్న వీడియో క్లిప్‌ను మాత్రం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment