
నిందితుడు రఫిక్ (ఫైల్)
మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి అలియాస్ షబానా(26)కు ఆరేళ్ల క్రితం హన్మకొండకు చెందిన రఫిక్‌తో పరిచయం ఏర్పడింది. ఇరువురు ప్రేమించుకున్నారు. మతం మారితేనే తమ కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని రఫిక్ చెప్పడంతో కృష్ణవేణి మతం మార్చుకుంది. 2013 ఆగస్టులో వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణవేణి అలియాస్ షబానాకు ఐదు సార్లు అబార్షన్ కావడంతో వేధింపులు ప్రారంభమయ్యాయి.
రఫిక్‌తో పాటు అతని తల్లితండ్రులు, కుటుంబసభ్యులు తరచూ వేధిస్తుండడంతో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె తల్లితో కలిసి మల్లికార్జుననగర్‌లో ఉంటోంది. ప్రస్తుతం గర్భిణి అయిన షబానాను రఫిక్ పట్టించుకోకపోవడమేగాక అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడు. దీంతో గత జులైలో మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వేధింపులు మానుకోకపోవడంతో బాధితురాలు మంగళవారం రఫిక్ అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాలితో తన్నాడు:కృష్ణవేణి అలియాస్ షబానా
ప్రేమించిన వ్యక్తి కోసం మతాన్ని మార్చుకున్నాను. వేధింపులు తీవ్రం కావడంతో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గర్బవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు. తనకు పరిచయమున్న పోలీస్ అధికారితో బెదిరిస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు సైతం వేరే పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment