ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు హోటల్‌కు వెళ్లిన ఓ జంట కొద్ది సేపటికే వీరంగం సృష్టించింది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా గొడవకు దిగి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ ఘర్షణలో యువతి విగతా జీవిగా మారింది. ఈ విచారకర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రియుడి విక్కిమన్ పుట్టినరోజును జరుపుకోడానికి ఓ వివాహిత సోమవారం అలీపూర్‌లో ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసింది. సరదాగా గడుపుతున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగారు. గొడవ కాస్తా పెరగడంతో కోపాన్ని ఆపుకోలేని విక్కీ కత్తితో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
కాగా మంగళవారం ఉదయం టిఫిన్ ఇవ్వడానికి వెళ్లిన హోటల్ సిబ్బంది దారుణ పరిస్థితుల్లో.. రక్తపు మడుగుల్లో ఉన్న యువతిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో హోటల్ రిసెప్షన్‌లో ఇచ్చిన వివరాలతో సంబంధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇక హోటల్ నుంచి పారిపోయిన నిందితుడిని మంగళవారం మధ్యాహ్నం అలీపూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పార్టీలో వివాహితతో కలిసి మద్యం సేవించిన అనంతరం.. ఆమె తనపై అకారణంగా చేయి చేసుకుందని విక్కి మన్ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో కత్తితో ఆమెపై దాడి చేసినట్లు వ్యక్తి పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక వీళ్లిద్దరికి సోషల్ మీడియా ద్వారా ఏడాది క్రితం పరిచయమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేగాక బాధితురాలికి ఇంతకుముందే మరో వ్యక్తితో వివాహం జరిగినట్లు.. ఆమెకు ఇద్దరు సంతానం కూడా ఉన్నట్లు తేలింది. అయితే ఈ జంట గత ఐదు నెలల్లో ఆరు, ఏడు సార్లు హోటల్‌ను సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు. తమ హోటల్‌లో ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నామని సదరు హోటల్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment