చికిత్సపొందుతున్న నీలం అగర్వాల్
అత్తాపూర్ : వరకట్న వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ తేజస్వినీనగర్ ప్రాంతానికి చెందిన నీలం అగర్వాల్(28), శివఅగర్వాల్‌లు దంపతులు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొద్దిరోజులుగా శివ, అతడి తల్లి విజయలక్ష్మి అదనపు కట్నం తేవాలని నీలం అగర్వాల్‌ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు.
గత రెండు రోజులుగా వేధింపులు ఎక్కువ కావడం, భర్త శివకు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో నీలం తీవ్ర నిరాశకు గురైంది. ఇదే క్రమంలో విజయలక్ష్మి నీలంను అదనపు కట్నం తీసుకురావాలని గొడవ పడటంతో విషయాన్ని భర్త శివకు తెలిపింది. దీంతో అతడు నీలంను కొట్టి తను ఇంట్లో నుంచి వెళ్లిపొతానంటూ బెదిరించాడు. గొడవలు భరించలేక అదనపు కట్నం తీసుకురాలేనని నీలం అగర్వాల్ శుక్రవారం ఉదయం ఇంటిపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటనలో నీలం రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. నీలం అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భర్త, అత్తపై వరకట్న వేధింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment