మాటలు కలిపి.. మాయ చేస్తారు! | Women Thieves Use The Trick Of Magical Words For Robbery | Sakshi
Sakshi News home page

మాటలు కలిపి.. మాయ చేస్తారు!

Published Thu, Oct 3 2019 11:39 AM | Last Updated on Fri, Oct 4 2019 12:06 PM

Women Thieves Use The Trick Of Magical Words For Robbery - Sakshi

సాక్షి, బోధన్‌: ఆర్టీసీ బస్టాండ్‌లలో దుండగులు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రయాణికులను గమనించి ప్రణాళిక ప్రకారం నగదు, ఆభరణాలను దోచుకుంటున్నారు. నవీపేట, నిజామాబాద్‌లలో ఇటీవల జరిగిన రెండు వరుస సంఘటనలతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి జంకుతున్నారు. నవీపేటలోని బస్టాండ్‌లో పది మంది మహిళా ముఠా సభ్యులు పథకం ప్రకారం చోరీలు చేస్తున్నారు. గల్లీల్లో పూసలు(మహిళల అలకంరణ కోసం) అమ్ముకుంటామని ఇంటికి తిరిగి వెళ్తున్నామని, బస్సు కోసం చూస్తున్నామని తోటి ప్రయాణికులను నమ్మించారు. బస్సెక్కే సమయంలో ఓ ప్రయాణికురాలి చేతిలో ఉన్న బ్యాగును కొట్టేసేందుకు ప్రయత్నించగా సదరు మహిళ ప్రతిఘటించింది. ఆ బ్యాగులో రూ.3 లక్షల నగదు ఉండడంతో ఊపిరి పీల్చుకున్న సదరు ప్రయాణికురాలు హడావుడిగా నిజామాబాద్‌కు వెళ్లిపోయింది. తమ పని కాలేదని భావించిన మహిళా దుండగులు ముఠా సభ్యులు మరో ప్రయాణికుడి కోసం గాలం వేశారు. బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ అనే వ్యక్తి రూ.48 వేల నగదుతో బస్టాండ్‌కు వచ్చాడు. అతడితో మాటలు కలిపిన మహిళలు నగదుతో ఉన్న బ్యాగును ఎత్తుకుని ఆటోలో పారిపోయారు. ఈ ముఠాలోని కొందరు సభ్యులను స్థానికులు పట్టుకున్నారు. ఎనిమిది మంది మహిళా ముఠా సభ్యులను పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీలపై విచారిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ప్రభుత్వ టీచర్‌ స్రవంతి దగ్గర 13 తులాల బంగారు ఆభరణాలను కొట్టేశారు. బస్సు దిగే సమయంలో ఒకరినొకరు తోపుకుంటూ ఆత్రుతగా దిగే ప్రయత్నంలో దొంగలు సునాయసంగా బ్యాగులో ఉన్న బంగారాన్ని అపహరించారు. 

రాకపోకలను గమనించి మాటేస్తారు.. 
బస్టాండ్‌లలో చోరీలకు ఈజీగా ఉంటుందని కొందరు మహిళా ముఠా సభ్యులు బస్టాండ్‌లను అనువుగా ఎంచుకున్నారు. గ్రామాల్లోని గల్లీలో తిరుగుతూ వ్యాపారాలు చేసే మహిళలు పనిలో పనిగా మహిళల రాకపోకలను గమనిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అని మాటలు కలుపుతున్నారు. నవీపేటకు చెందిన మహిళ చీటీ డబ్బులను తీసుకుని వెళ్తుండగా గమనించిన ముఠా మహిళలే పథకం ప్రకారం చోరీకి యత్నించి విఫలమయ్యారు. గ్రామాల్లో ఇలాంటి వ్యాపారాలు చేసే మహిళల రాకపోకలు ఎక్కువవుతున్నాయి. అల్యూమీనియం వంట పాత్రల విక్రయాలు, జిప్పుల మరమ్మతులు, పిల్లలు ఆడుకునే బుగ్గలను అమ్మే మహిళల్లో కొందరు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారు.  

బస్సు ఎక్కి, దిగే సమయంలోనే.. 
ముఠా సభ్యులు ప్రయాణికులు రద్దీగా ఉండే సమయంలోనే చోరీలు చేస్తున్నారు. బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సెక్కే సమయంలో తమ వద్ద ఉన్న వస్తువులపై తాత్కాలిక నియంత్రణ కోల్పోతారు. ఆత్రుతలో ఏం జరుగుతుందో గమనించలేకపోతున్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారే గానీ చోరీ తంతులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ లోపాలను ఆసరాగా చేసుకున్న దుండగులు అవలీలగా చోరీలు చేస్తున్నారు. నవీపేట, నిజామాబాద్‌ బస్టాండ్‌లలో చోరీలు ఇలాగే జరిగాయి. 

విచారిస్తున్న పోలీసులు 

నవీపేటలో ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా నిందితులు(ఫైల్‌)  

నవీపేట బస్టాండ్‌లో చోరీకి పాల్పడి హల్‌చల్‌ చేసిన పది మంది మహిళా ముఠాలోంచి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీపుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఎక్కడెక్కడా చోరీలు పాల్పడ్డారు, ఎంత మంది ముఠాలో ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఎనిమిది మందిలోంచి ఆటోలో పారిపోయిన మరో ఇద్దరి వివరాలు కోసం పోలీసులు విచారిస్తున్నారు. బస్టాండ్‌లోనే చోరీలు జరగడంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి 
ఆర్టీసీ బస్టాండ్‌లలోనే తరచూ చోరీలు చోటు చేసుకుంటున్నాయి. బస్టాండ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సూచించాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటివారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్సు ఎక్కే, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.  
–శ్రీనాథ్‌రెడ్డి, అర్బన్‌ టౌన్‌ సీఐ, నిజామాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement