
షోళింగర్: ప్రేమ వివాహాన్ని కుటుం బసభ్యులు వ్యతిరేకించారనే ఆక్రోశంతో యువకుడు విచక్షణ కోల్పోయాడు. ఉన్మాదిలా మారి కుటుంబసభ్యులపై విరుచుకుపడ్డాడు. వారిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వదిన ప్రాణాలు కోల్పోగా అన్న, చెల్లెలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని షోళింగర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. షోళింగర్ సమీపం తొండమనత్తం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు నవీన్(25), అమ్మూరుకు చెందిన యువతిని ప్రేమించి పెద్దలకు చెప్పకుండా మంగళవారం గుడిలో వివాహం చేసుకున్నారు. సాయంత్రం నవీన్, భార్యను ఇంటికి తీసుకెళ్లగా అతని అన్న సేట్టు, వదిన శకుంతల, చెల్లెలు అముద ఇంట్లోకి రానివ్వలేదు.
దీంతో చేసేది లేక నవీన్ భార్యను పుట్టింట్లో వదిలి రాత్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో గొడవ చోటుచేసుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన నవీన్ కత్తితో కుటుంబసభ్యులపై దాడి చేశాడు. దాడిలో వదిన శకుంతల అక్కడికక్కడే మృతి చెందింది. సేట్టు, అముద కత్తిపోట్లకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు వారిని వాలాజా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వేలూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శకుంతల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నవీన్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment