
ప్రమాదానికి కారణమైన టాటాఏస్ వాహనం, మృతి చెందిన రాజశేఖర్
అందొచ్చిన కొడుకు...ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆ ఆనందంలోనే తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. వీరి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో ఆ యువకుడిని కాటేసింది. విధుల నిర్వహణకని బయలుదేరిన చెట్టంత కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరి రోదనలు చూసి చూపరులు కంటతడి పెట్టారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...
పూసపాటిరేగ: మండలంలోని కామవరం గ్రామ సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెంకు చెందిన కరణపు రాజశేఖర్(23) రెడ్డీస్ ఫ్యాక్టరీలో విధుల నిమిత్తం తమ స్నేహితుడు పెద్దింటి పవన్‌కుమార్‌తో కలిసి మోటారుసైకిల్‌పై తమ స్వగ్రామం నుంచి మంగళవారం ఉదయం బయలుదేరారు. కామవరం గ్రామం సమీపిస్తుండగా ఉదయం 8.30 గంటల సమయంలో స్కూల్ పిల్లల కోసం టాటాఏస్ వాహనం కనిమెల్ల వైపు వెళ్తుండగా ఎదురెదురుగా టాటాఏస్, బైక్ బలంగా ఢీకొన్నాయి. రాజశేఖర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకొంది.
చేతికందొచ్చిన కుమారుడు...
ప్రమాదంలో రాజశేఖర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందొచ్చిన కుమారుడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో తండ్రి అప్పలనాయుడు రోదిస్తూ తల్లడిల్లిపోయారు. ఈయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తమ బిడ్డ లేకుండా ఎలా బతికేదని తల్లిదండ్రులు సత్యవతి, అప్పలనాయుడు రోదించడంతో చూపరులు కంటతడి పెట్టుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ జి.కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.