
నరేష్ (ఫైల్)
మనోహరాబాద్(తూప్రాన్): పెళ్లి ఇష్టం లేదని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామస్తులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన ఎర్కలి భిక్షపతి, పెంటమ్మల పెద్ద కొడుకు నరేష్(22) నిత్యం మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ పరిశ్రమలో పని చేయడానికి రైలులో వెళ్లేవాడు. మంగళవారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి డబిల్‌పూర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. దీంతో వారంతా అక్కడికి తరలివెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని పంచనామా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉండేవాడని, పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.