సాక్షి, హైదరాబాద్: ప్రేమ... పెళ్లి.... పగ... దాడి... హత్య... ఆత్మహత్య... రాష్ట్ర వ్యాప్తంగా వరుసపెట్టి ఇలాంటి ఉదంతాలే వెలుగు చూస్తున్నాయి. వీటిలో కొన్ని నగరంలోనూ చోటు చేసుకుంటున్నాయి. ఈ సిరీస్‌కు కొంత డిఫరెంట్‌గా రెండు లవ్‌స్టోరీలు సిటీ పోలీసు కమిషనరేట్‌లోని ఓ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఓ యువతి వేధింపులు తట్టుకోలేక మెరిట్ స్టూడెంట్ పూర్‌గా మారిపోగా... మరో యువతి తనపై ‘వివక్ష’ చూపిందంటూ భగ్న ప్రేమికుడు ఠాణాకు ఎక్కాడు. చట్ట పరిధిలోకి రావంటూ పోలీసులు చెప్పిన అభిప్రాయంతో మౌఖిక ఫిర్యాదుల వద్దే ఆగిపోయిన ఈ రెండు ప్రేమ కథా విచిత్రాలూ రికార్డుల్లోకి ఎక్కలేదు.
ఆ యువకుడి విషయంలో సీన్ రివర్స్...
యువకులు ప్రేమ పేరుతో యువతుల వెంటపడటం, వారు తిరస్కరిస్తే వివిధ రకాలుగా వేధించడం... ఇలాంటి కేసులు తరచు పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతూనే ఉంటాయి. దీనికి పూర్తి భిన్నమైన కథ ఈ యువకుడిది. ఓ వైద్యురాలి కుమారుడైన ఇతగాడు ఆది నుంచి మెరిట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్‌ను 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ఈ యువకుడినీ వైద్యుడినే చేయాలని భావించిన ఆ వైద్యురాలు నీట్ కోచింగ్ కోసం పశ్చిమ మండల పరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. కొన్నాళ్ల పాటు ఇతడి కోచింగ్ సజావుగానే సాగింది. ఇతడితో పాటే కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతికి మూర్ఛరోగం ఉంది. ఓ సందర్భంలో క్లాసులోనే కుప్పకూలిన ఆమెకు ఇతగాడు సాయం చేశాడు. అప్పటి నుంచి ఆ యువతి ప్రేమ పేరుతో అతడి వెంట పడడం ప్రారంభించింది.
ఓ దశలో ఆమె వేధింపులు వాట్సాప్ వరకువెళ్ళాయి. అభ్యంతరకరమైన, అశ్లీల ఫొటోలు, సందేశాలతో అతడిని పూర్తిగా డిస్ట్రబ్ చేయడం మొదలెట్టింది. దీంతో ‘హీరో’ లాంటి స్టూడెంట్ మార్కులు ‘జీరో’లకు పడిపోయాయి. ఈ విషయం గమనించిన వైద్యురాలు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఆమె పోలీసుస్టేషన్‌కు వచ్చి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఇలా అయితే చట్టపరిధిలోకి రాదని పోలీసులు చెప్పడంతో తమ పేర్లు రికార్డుల్లోకి ఎక్కడ ఇష్టం లేని ఆమె ఫిర్యాదు ప్రయత్నం విరమించుకున్నారు. చివరకు కుమారుడి నుంచి స్మార్ట్‌ఫోన్, పాత ఫోన్ నెంబర్ లాక్కుని ఆంధ్రప్రదేశ్‌కు పంపి మరో ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు.
ఆ ఫిర్యాదు చూసి అవాక్కైన పోలీసులు...
ఈ భగ్న ప్రేమికుడి వ్యవహారం మరోలా ఉంది. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన యువకుడు ఉద్యోగం కోసం నగరానికి వలసవచ్చాడు. ఇతడికి పరిచయమైన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి కొన్నాళ్ల పాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. హఠాత్తుగా వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టంది. ఇతగాడి వ్యవహారశైలి నచ్చకో, పెళ్ళికి పెద్దలు నిరాకరించో, మరే ఇతర కారణమో కానీ ఆమె అతగాడికి దూరంగా ఉండటం మొదలెట్టింది. అయినప్పటికీ పట్టు వదలని ఈ యువకుడు కొన్ని రోజుల పాటు నిర్విరామంగా ఆమె వెంట పడ్డాడు. చివరకు ఆమెకు వివాహం నిశ్చయమైందని తెలియడంతో ఆమెపై ‘కక్ష’ కట్టాడు. ఇది తీర్చుకోవడానికి ‘లిఖిత పూర్వకంగా’ ఠాణా తలుపుతట్టాడు.
ఆ ఫిర్యాదును చూసిన పోలీసులకు మతి పోయినంత పనైంది. దాదాపు రెండేళ్ళ పాటు ఆమె తనతో సన్నిహితంగా మెలిగిందని, అయితే ఓ దశలో ‘తన బ్యాగ్రౌండ్’ తెలిసిన తర్వాతే దూరంగా పెట్టడం మొదలెట్టిందని అందులో పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా వివక్ష కిందికే వస్తుందంటూ పేర్కొన్న ఆ భగ్న ప్రేమికుడు ఆమెపై కేసు నమోదు చేయాలని కోరాడు. అంతటితో ఆగకుండా ఆమెపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులకు అల్టిమేటం ఇచ్చాడు. అయితే ఈ ఆరోపణలపై అలా కేసులు నమోదు, చర్యలు తీసుకోవడం కుదరదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అతగాడు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment