
మేడ్చల్: స్నేహితురాలి బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కండ్లకోయలో ఉంటున్న అనుషా(17)శనివారం ఉదయం కొంపల్లిలో ఉంటున్న తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు బయలుదేరి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో మహిళ..
బొల్లారం: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుమలగిరి, పెద్ద కమేళా ప్రాంతంలో ఉంటున్న కణక్‌రామ్‌కు నలుగురు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అతని నాలుగో కుమార్తె అనిత(35) టైలరింగ్ చేసేది. గత కొద్ది రోజులుగా పెళ్లి విషయమై తండ్రి,కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10న పని ఉందని బయటికి వెళ్లిన అనిత ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం ఆమె తండ్రి కణక్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.