సోని (ఫైల్)
హయత్‌నగర్: ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రికి మాయ మాటలు చెప్పి అతడి కుమార్తెను అపహరించుకెళ్లిన సంఘటన మంగళవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, కొండ మల్లేపల్లికి చెందిన ఎలిమినేటి యాదయ్య బొంగుళూర్ గేటు వద్ద టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సోని(21) పిగ్లీపూర్‌లోని ఎస్‌ఎల్సీ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతుండగా, కుమారుడు డేవిడ్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం యాదయ్య టీ స్టాల్ వద్దకు (ఏపి39 ఎక్యూ1686) కారులో వచ్చిన ఓ వ్యక్తి వచ్చి టీ తాగుతూ అతడితో మాటలు కలిపాడు.
తన పేరు శ్రీధర్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న అతను తన తల్లి డాక్టర్ అని, తండ్రి జడ్జి పని చేస్తున్నాడని, సోదరుడు కమిషనర్‌గా ఉన్నట్లు తెలిపారు. మీ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతని మాటలు నమ్మిన యాదయ్య కుమార్తె, కుమారుడిని రాగన్నగూడ లక్ష్మి మెగా సిటీ వెంచర్ వద్దకు పిలిపించాడు. శ్రీధర్ రెడ్డి వారు ముగ్గురిని కారులో నగరానికి తీసుకొచ్చాడు. డేవిడ్‌ను బీఎన్‌రెడ్డి నగర్ వద్ద దించిన అతను తండ్రీ,కూతురిని నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పాడు. మధ్యాహ్నం వారి భోజనం కూడా పెట్టించాడు. సర్టిఫికెట్ల కోసమని ఎస్‌ఎల్సీ కళాశాలకు తీసుకువెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో హయత్‌నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద సోని పూర్తి వివరాలను తెల్ల కాగితంపై రాసి జిరాక్స్ తీసుకురావాలని యాదయ్యను పంపించాడు. అతను కారు దిగి వెళ్లిపోగానే సోనీని తీసుకుని వెళ్లి పోయాడు. వారి కోసం గాలించినా ఆచూకీ తెలియక పోవడంతో యాదయ్య బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment