ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : 23 ఏళ్ల డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ షీలా ఓ రోజు కొంచెం ఆలస్యంగా ఆఫీసుకు బయల్దేరింది. తానెక్కిని మినీ బస్సు ఆఫీసుకు సమీపంలోకి రాగానే ముందు వైపున్న ఫుట్‌బోర్డు పైకి వెళ్లింది. కొంచెం బస్సును స్లో చేస్తే తాను ఆఫీసు ముందు దిగిపోతానని డ్రైవర్‌ను కోరింది. అదేమి వినిపించుకోని డ్రైవర్ అలాగే బస్టాప్ వైపు బస్సును తీసుకెళుతున్నారు. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి రావాలంటే పదిహేను నిమిషాలు పడుతుంది. బస్సు ఈ లోగా కొంచెం స్లోకాగానే ఆమె ఏమీ ఆలోచించకుండా అందులో నుంచి దూకేసింది. అదుపు తప్పి కింద పడిపోయింది. కుడి మోచేతి, ఎడమ మోకాలు కొట్టుకు పోయాయి. అలాగే ఆఫీసుకు వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం సెలవు పెట్టి ఇంటికి వెళ్లింది.
దక్షిణ్‌పురిలోని తన ఇంటి నుంచి దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా ఫేస్ వన్‌లోని ఆఫీసుకు షీలా ప్రతి రోజు గ్రామీణ సేవా మినీ బస్సు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు ఆమెకు పోను ఐదు రూపాయలు, రాను ఐదు రూపాయలు బస్సు ఛార్జీలు అవుతున్నాయి. అదే ఆటోలో వెళ్లాలంటే పోను, రాను 20 రూపాయలు సమర్పించుకోవాలి. ఢిల్లీ నగరంలో 3,900 బస్సులు ఉన్నప్పటికీ, 373 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ ఉన్నప్పటికీ షీలాకు అందుబాటులో ఉన్న బస్సు సౌకర్యం ఇదే. అంటే అంతకన్నా ఆమె ఎక్కువ డబ్బులు ప్రయాణానికి ఖర్చు పెట్టలేదు. షీలా లాంటి వాళ్లు నగరంలో చాలా మంది ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నగరంలోని బస్సుల్లో, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు విద్యాలయాలు, ఆఫీసులకు, మార్కెట్లకు వెళ్లేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతోందన్న ఉద్దేశంతో కేజ్రివాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది. పట్టణాల్లోనే మహిళలకు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ ఆశ్చర్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు ఏదో ఒక పనికి వెళుతున్నారు. ఢిల్లీ కూడా అందుకు విరుద్ధం ఏమీ కాదు.
ఢిల్లీలో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎత్తయిన బహుళ అంతస్తు కార్యాలయాలు, మాల్స్, హోటళ్లు, కేఫ్‌లు ఎప్పుడు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. కానీ 15 ఏళ్లు దాటిన 11.7 శాతం స్త్రీలు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. జాతీయంగా మహిళలు సరాసరి 27 శాతం మంది పనిచేస్తుండగా అందులో ఢిల్లీలో పనిచేస్తున్న మహిళల సంఖ్య సగం కూడా లేక పోవడం ఆశ్చర్యం కల్పిస్తోంది.
ఇంటిపట్టున ఉంటున్న చాలా మంది మహిళలను ఉద్యోగం విషయంలో కదిలించగా, ఉద్యోగాలకు అప్లై చేయడానికి డబ్బులు లేవని, అప్లై చేసినా అంతంత దూరం ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు ఇట్లో డబ్బులివ్వరని చెప్పారు. ముఖ్యంగా పెళ్లి చేసుకొని ఉద్యోగం చేయాలనుకుంటున్న మహిళల బాధ మరోలా ఉంది. చాలీ చాలీ జీతాలు అందుకుంటున్న భర్తలు డబ్బులివ్వలేరని, ఉండి ఇద్దామనుకున్న భర్తలను అత్తామామలు వారిస్తున్నారని, వారికి తాము ఉద్యోగం చేయడం ఇష్టంలేకేనని చెప్పారు. కేజ్రివాల్ తీసుకున్న నిర్ణయం వల్ల తాము ఇప్పుడు ఎక్కడికైనా స్వతంత్రంగా వెళ్లి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందిన షీలా, సుషా, రాధ తదితరులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment