‘సునంద మృతికి ఐపీఎల్ కారణమా?’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తులో భాగంగా.. 2010 నాటి ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నీ వివాదంపైనా దృష్టి పెడతామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.. సునంద మృతికి, ఆ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతామని పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ మంగళవారం వెల్లడించారు. సునంద మృతికి బాధ్యుడెవరనే విషయంపై దర్యాప్తు అనంతరం అన్ని విషయాలను క్రోడీకరించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
2010లో ఐపీఎల్ కొచ్చి యజమానులు సునందకు ఉచితంగా 19% వాటాకు సమానమైన రూ. 70 కోట్లు ఇవ్వడంపై వివాదం తలెత్తింది. అప్పటికీ శశి థరూర్‌తో ఆమె వివాహం కాలేదు. ఐపీఎల్ కొచ్చి ఫ్రాంచైజీలో శశి థరూర్ బినామీగా ఆమె వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అప్పుడు వచ్చాయి. కాగా, శశి థరూర్‌ను సోమవారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి దాటేవరకు.. నాలుగు గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. థరూర్ పూర్తిగా సహకరించారని బస్సీ తెలిపారు. థరూర్‌ను మరోసారి ప్రశ్నించే అవకాశాలను బస్సీ తోసిపుచ్చలేదు.