సాక్షి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి ఓటమి భయం పట్టుకుంది. ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్నారు. ఓవైపు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం వర్గీయుడి నుంచి పోలీసులు రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడు, రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ డబ్బును వాహనాల కొనుగోలుకు తరలిస్తున్నట్లు తెలిసింది.
ప్రలోభాల పర్వం..
రాప్తాడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిటాల సునీత మంత్రిగా కొనసాగుతున్నారు. పదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది శూన్యం. నియోజవకర్గంలోని రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు కుటుంబీకులు, తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి ‘సామంతుల’ పాలన సాగించారు. అభివృద్ధి మాటున దోపిడీ చేశారు. చివరకు వారి పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి, దిగువశ్రేణి నాయకులను సైతం దగ్గరికి రానీవ్వకుండా మంత్రి సామాజిక వర్గం వారే అన్ని పథకాల్లోనూ దోచుకున్నారు. ప్రతి విషయంలోనూ వారిదే పెత్తనం.
వారిని కాదని నేరుగా మంత్రిని కలిసే అవకాశం కూడా లేదని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారు. ఫలితంగా ప్రజలతో పాటు సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది లోలోనే మదనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకతను అంచనా వేసిన మంత్రి పరిటాల సునీతకు ఈసారి తాను బరిలో నిలిస్తే ఓడిపోతానని తెలిసిపోయింది. కుమారుడు శ్రీరాం అయితే కనీస పోటీ అయినా ఇస్తాడనే ఆలోచనతో బరిలో దింపారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఓటుకు రూ.2 వేల దాకా ఇవ్వాలని నిర్ణయించారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఓట్లను బట్టి ఇంటికి రూ.5 వేల నుంచి రూ.15 వేల దాకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
స్కార్పియోలు, బైకుల ఆఫర్
ఓ స్థాయి నాయకులకు స్కార్పియోలు, బైకులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జాబితా కూడా తయారు చేసినట్లు సమాచారం. పరిటాల శ్రీరాంకు గెలుపు జీవన్మరణ సమస్యగా మారడంతో ఎలాగైనా బయట పడేందుకు పరిటాల కుటుంబం తంటాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని ప్రలోభాలకు గురి చేస్తారనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment