వంద రోజులు పని కల్పించాల్సిందే
-
డ్వామా పీడీ హరిత
అనంతసాగరం(సోమశిల) : జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించాలని డ్వామా పీడీ హరిత తెలిపారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో గురువారం అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు మండలాలకు చెందిన జాతీయ ఉపాధి హామీ సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత ఇస్కపల్లి, మినగల్లు, పాతదేరాయపల్లి తదతర గ్రామాల్లో ఆమె పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూలీకి రూ.131 కూలి వస్తోందని, అయితే ఆ మొత్తం రూ.160కు తగ్గకుండా చూడాలన్నారు. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాలు ఫాంపాండ్స్ నిర్మాణ లక్ష్యంలో వెనకంజలో ఉన్నాయన్నారు. జిల్లాలో 10 వేల పాండ్స్ లక్ష్యం కాగా ఈ మూడు మండలాలల్లో ఆరువేలు ఏర్పాటుచేయాలన్నారు. నాడెప్ కంపోస్టు తొట్టెలు ప్రతి గ్రామంలో కనీసం 25కి తగ్గకుండా ఏర్పాటుకావాలన్నారు. సమావేశంలో ఆత్మకూరు డ్వామా ఏపీడీ మృదుల, ఎంపీడీఓలు ఐజాక్ ప్రవీణ్, రమేష్, ఏపీఓలు దయానంద్, లక్ష్మీనర్సయ్య, మురళీ పాల్గొన్నారు.