పైకప్పు రేకుపై పడిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకునే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు చనిపోయాడు.
జన్నారం(ఆదిలాబాద్): పైకప్పు రేకుపై పడిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకునే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా జనానరం మండలం తిర్మన్‌గూడకు చెందిన మార్కారి లక్ష్మి, గంగన్న దంపతుల కుమారులు నరేశ్(12), రాజేశ్(12) ఇందన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. శుక్రవారం ఉదయం టీ, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని డాబాపైకి వెళ్లారు.
అన్నదమ్ములు ఒకరి చేతిలోని బిస్కట్ ప్యాకెట్‌ను మరొకరు సరదాగా లాక్కునేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ఆ ప్యాకెట్ డాబా ముందరి రేకులపై పడిపోయింది. దీనిని తీసుకురావడానికి నరేశ్ రేకులపైకి దిగాడు. అయితే, ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తున్న సర్వీస్ తీగ తెగి రేకులను తాకి ఉంది. దీంతో నరేశ్ కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో రాజేశ్ గాయాలై పడిపోయాడు. వెంటనే రాజేశ్‌ను జన్నారం ఆస్పత్రికి తరలించారు.