14లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
Published Mon, Jul 25 2016 9:04 PM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM
విజయవాడ : జిల్లాలో ‘వనం – మనం’ కార్యక్రమంలొ భాగంగా 14 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ బాబు.ఎ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి.రమేష్‌కు తెలిపారు. వనం – మనం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పి.వి.రమేష్ స్పెషల్ సెక్రటరీ సురేంద్రపాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎస్.వి.ఎల్.మిశ్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ బాబు.ఎ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమంత్రి కోటి మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇందు కోసం గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుని చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రడు, విజయవాడ సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జిల్లా అటవీ శాఖ అధికారులు బెనర్జీ, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement