-గంటసేపు నరక యాతన
-స్థానికంగా ఉండని సిబ్బంది
-ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఇందూరు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో గల ఐసీడీఎస్ శాఖకు చెందిన స్వధార్ హోంలో పద్నాలుగేళ్ల బాలిక బిడ్డను ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నేలపై బిడ్డను ప్రసవించి గంటకుపైగా నరక యాతన అనుభవిస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టించుకుందామంటే అందులో ఉన్నవారంతా బాలికలే. ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురయ్యారు. అయితే ఒక్క పక్క బాలిక బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది.
మరో పక్క పుట్టిన బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు. పుట్టిన బిడ్డ, బాలిక పరిస్థితి విషమిస్తుందనే సమయానికి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు స్వధార్ హోంకు చేరుకుని 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. మరో అరగంట ఆలస్యం జరిగితే బాలికకు, పుట్టిన బిడ్డకు ఇన్‌ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయే వారని వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది.
ఒక పక్క ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే జరపాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా చెబుతుంటే.. ఇలా ఎక్కడో ఒక చోట అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. అయితే స్వధార్ హోంలో జరిగిన ప్రసవం మామూలు విషయం కాదు. 14 ఏళ్ల బాలిక, అది కూడా ఏడవ నెలలోనే ప్రసవించడం చాల ఆందోళనకరమైన పరిస్థితి. బాధిత బాలికల బాగోగులు చూడాల్సిన నిర్వాహకులు స్థానికంగా లేకపోవడం, జరిగిన విషయంపై ఐసీడీఎస్ అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకుకోండా పట్టింపులేనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
ఇంత జరిగినా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లకపోవడం విశేషం! స్వధార్ హోం పర్యవేక్షకురాలిని సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా బాలిక జిల్లా ఆసుపత్రిలో ప్రసవించిందని చెప్పడం కొసమెరుపు. అలాగే స్వధార్ హోం నిర్వహకులను ఫోన్‌లో సంప్రదించగా జరిగిందేదో జరిగింది, విషయాన్ని పెద్దదిగా చేయవద్దని చెప్పడం మరో గమనార్హం. అసలు విషయం .. బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు నిర్భయ కేసును నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే బాలికకు మూడవ నెల అని నిర్ధారించారు.
ఈ సమయంలో అబార్షన్ చేయడం బాలికకు ప్రమాదమని తెలుపడంతో, బాలిక కడుపులో గర్భాన్ని అలాగే ఉంచారు. ఐసీడీఎస్ అధికారులు బాలికకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పించారు. బాలికకు సెప్టెంబర్‌కు తొమ్మిది నెలలు నిండుతాయని, అప్పుడే ప్రసవం చేయాలని వైద్యులు సూచించారు. అయితే బాలిక ఏడవ నెల గర్భంలోనే జూలై 21న ఉదయం 6 గంటలకు స్వధార్ హోంలోనే బిడ్డను ప్రసవించింది. నొప్పులతో బాలిక అరుస్తుంటే ఏం చెయ్యాలో తోచని స్థితిలో తోటి బాలికలు ఉండిపోయారు. స్థానికంగా ఉండాల్సిన స్వధార్ హోం నిర్వాహకులు, సూపరింటెండెంట్, కౌన్సిలర్, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. బాలిక అక్కడే నేలపై బిడ్డను ప్రసవించింది.