15 అంతస్తుల్లో సచివాలయం
♦ 10 వేలమంది ఉద్యోగులు పనిచేసేలా డిజైన్
♦ మొత్తం 8 సెక్షన్లుగా సముదాయం విభజన
♦ తుళ్లూరు వైపునుంచి ప్రవేశమార్గం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలోని పరిపాలనా భవనాల సముదాయంలో కీలకమైన సచివాలయాన్ని 15 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఐకానిక్ కట్టడాలుగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించాలని నిర్ణయించినా సచివాలయానికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పది వేల మంది ఉద్యోగులు పనిచేసేలా మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన ఫుమిహికో మకి అసోసియేట్స్ దీన్ని డిజైన్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవస్థలనూ ఈ సముదాయంలోనే ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 900 ఎకరాల్లో నిర్మించే సముదాయాన్ని ఎనిమిది సెక్షన్లుగా విభజించింది.
తుళ్లూరు వైపునుంచి ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసింది. అటూ ఇటూ భవనాలు మధ్యలో పూర్తిస్థాయి పచ్చదనం, స్థూపాలుండేలా పలు నిర్మాణాలను ప్రతిపాదించింది. తుళ్లూరు సమీపం నుంచి ప్రారంభమయ్యే సముదాయం కృష్ణానదీ తీరం వరకు ఉంటుంది. నదీముఖంగా ఉండే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా డిజైన్లు రూపొందించింది. అసెంబ్లీ భవనాల్లో మండలికి చిన్న భవనం, అసెంబ్లీకి పెద్ద భవనాన్ని డిజైన్ చేసింది.
మొదటి సెక్షన్‌లో రాజ్‌భవన్
నదీముఖంగా ఏర్పాటయ్యే మొదటి సెక్షన్‌లో రాజ్‌భవన్, దానికి ఎదురుగా ముఖ్యమంత్రి నివాస భవనాలు మధ్యలో ప్రజలు సంచరించే ప్రాంతం ఉంటుంది. రెండో సెక్షన్‌లో ఒకవైపు అసెంబ్లీ మరోవైపు హైకోర్టు మధ్యలో అమరావతి స్క్వేర్ ఉంటుంది. మూడో సెక్షన్‌లో ఒకవైపు భవిష్యత్తు అవసరాలకు కొంత స్థలాన్ని వదలి మరోవైపు విభాగాధిపతుల కార్యాలయ భవనాలు నిర్మిస్తారు. నాలుగో సెక్షన్‌లో ఒకవైపు కీలకమైన సచివాలయాన్ని ప్రతిపాదించారు. దాని పక్కనే రాయపూడి పార్కు, దానికి సమీపంలో విభాగాధిపతుల కార్యాలయాలు, విదేశీ ఏజెన్సీల కార్యాలయాల భవనాలు ఏర్పాటు చేస్తారు.
ఐదో సెక్షన్‌లో ఒకవైపు గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, మధ్యలో కన్వెన్షన్ సెంటర్లు, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించే కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు. దాని పక్కనే రాయపూడి పార్కు సమీపంలో ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు మధ్యలో ఒక స్థూపాన్ని నెలకొల్పుతారు. ఆరో సెక్షన్‌లో నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు, ఐఏఎస్ అధికారులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్వార్టర్లు ప్రతిపాదించారు. ఏడో సెక్షన్‌లో నాలుగో తరగతి ఉద్యోగుల క్వార్టర్లు వాటి పక్కన నాన్ గెజిటెడ్ ఉద్యోగుల క్వార్టర్లు, మధ్యలో రాయపూడి పార్కు దాని పక్కన క్రీడా సముదాయం ఉండేలా డిజైన్ రూపొందించారు. ఇక ఎనిమిదో సెక్షన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసం, దాని పక్కనే రాష్ట్ర మంత్రుల నివాసాలు, మధ్యలో అమరావతి గెస్ట్ హౌస్, సౌత్ ప్లాజా, చివరన జడ్జిల నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనాలన్నింటి చుట్టూ ఆర్టీరియల్ రోడ్లు, మెట్రో కారిడార్లు ఉండేలా డిజైన్‌లో ప్రతిపాదించారు.
ఎనిమిదో సెక్షన్‌కు హైకోర్టు!
రెండో సెక్షన్‌లో ఐకానిక్ కట్టడంగా నిర్మించాలని భావిస్తున్న హైకోర్టును ఎనిమిదో సెక్షన్‌లోకి మార్చనున్నట్టు తెలుస్తోంది. 8వ సెక్షన్‌లోనే జస్టిస్ సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు గురించి చర్చిస్తున్నారు. హైకోర్టు, జడ్జిల నివాసాలన్నీ ఒకేచోట ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకోనున్నట్టు సమాచారం.