సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ తీర్మానం ద్వారా రద్దు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ తామిచ్చిన తీర్పు అమలు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. అలాగే ఆ ఎమ్మెల్యేలకు గన్‌మన్లను పునరుద్ధరించకుండా నల్లగొండ, గద్వాల్ ఎస్పీలు ఎ.వి.రంగనాథ్, రెమా రాజేశ్వరి సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ కేసులో అవసరమైతే స్పీకర్‌ను సైతం ప్రతివాదిగా చేరుస్తామని, పరిస్థితిని బట్టి నోటీసు జారీ చేసి హాజరుకు ఆదేశాలు ఇస్తామని తేల్చిచెప్పింది. గతంలో ఎస్.ఆర్. బొమ్మై, మేఘాలయా కేసుల్లో స్పీకర్లను ప్రతివాదులుగా చేర్చగా సుప్రీంకోర్టు సమర్థించడాన్ని గుర్తు చేసింది. రాజ్యాంగమే అందరికీ సుప్రీం అని, దానికన్నా ఎవరూ అధికులు కాదని, మూడు వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేశారు.
అసెంబ్లీ కార్యదర్శికి అన్నీ తెలుసు...
ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో పిటిషనర్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసునన్నారు. ప్రతి నెలా అసెంబ్లీ కార్యదర్శి నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి శాసనసభ్యుల జాబితా పంపుతారని, తాజా జాబితాలో కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లు లేవన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్ల శాసనసభ్యత్వాల రద్దు విషయంలో ఈ కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతోపాటు అప్పీల్‌నూ కొట్టేసినా పిటిషనర్ల పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఆ ఎస్పీలకు ఎంత ధైర్యం..?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు అందాల్సిన జీతభత్యాలు, గన్‌మెన్ల సౌకర్యం గురించి న్యాయమూర్తి అడగ్గా శాసనసభ్యత్వాల రద్దు తరువాత గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించిందని వారి తరఫు న్యాయవాది బదులిచ్చారు. దీంతో ప్రభుత్వం అంటే ఎవరు అంటూ న్యాయమూర్తి గట్టిగా ప్రశ్నించారు. నల్లగొండ, గద్వాల్ జిల్లాల ఎస్పీలు న్యాయవాది బదులివ్వగా కోర్టు తీర్పు ఉన్నా గన్‌మెన్లను తిరిగి కేటాయించకపోవడానికి వారికి ఎంత ధైర్యం అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. వారిది కూడా ధిక్కారమేనని, వారిని ఎందుకు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేయలేదని ప్రశ్నించారు. వారిని ఈ కేసులో సుమోటోగా ప్రతివాదులుగా చేర్చే విషయాన్ని పరిశీలిస్తానన్నారు.
కోర్టు తీర్పు అమలు అసెంబ్లీ కార్యదర్శి బాధ్యత...
ఈ దశలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో వాదనలు వినాల్సిన అవసరం లేదని, ఫారం–1 నోటీసులు అందుకున్నాక వాదనలు వినిపించేందుకు సమయం ఇస్తానని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.
ఈ సమయంలో వెంకటరమణ కొన్ని సాంకేతిక అంశాలను లేవనెత్తగా కాజ్ టైటిల్ లోపాల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవద్దని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును అమలు చేసి తీరాల్సిన బాధ్యత అసెంబ్లీ కార్యదర్శిపై ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ పిటిషనర్ల శాసనసభ్యత్వాల రద్దులో న్యాయశాఖ కార్యదర్శికి ఎటువంటి పాత్ర లేదన్నారు. పిటిషనర్లు సైతం నిరంజన్‌రావుపై ఎటువంటి ఆరోపణలు చేయడం లేదని తెలిపారు. ఈ కేసులో నామమాత్రపు ప్రతివాదిగానే ఉన్నారని, అందువల్ల ఆయన చర్యలను ధిక్కారం కింద పరిగణించరాదన్నారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
శాసనవ్యవస్థతో ఘర్షణ పడటం లేదు...
న్యాయశాఖ కార్యదర్శి ఓ న్యాయాధికారి కూడానని, కోర్టు తీర్పు అమలు చేయకపోతే తలెత్తే పరిణామాలేమిటో ఆయనకు స్పష్టంగా తెలుసునని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ల విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే వచ్చే పరిణామాల గురించి వివరించాల్సిన బాధ్యత న్యాయాశాఖ కార్యదర్శిపై ఉందని, ఆ బాధ్యత నిర్వర్తించకపోవడం దారుణమన్నారు. తాము ఆదేశాలు జారీ చేశాక కోమటిరెడ్డి, సంపత్‌ల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం తమ తీర్పును అమలు చేసినప్పుడు అసెంబ్లీ, న్యాయశాఖల కార్యదర్శులు మాత్రం ఎందుకు అమలు చేయరని న్యాయమూర్తి ప్రశ్నించారు.
న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన రోజున ఆయన చర్యలు ఎలా ధిక్కారం కిందకు వస్తాయో అప్పుడు చెబుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో అవసరమైతే స్పీకర్‌ను సైతం ప్రతివాదిగా చేరుస్తామని, లేకపోతే ప్రతివాదిగా చేయాలని ఆదేశాలిస్తామన్నారు. అంతేకాక స్పీకర్‌కు నోటీసు జారీ చేసి హాజరుకు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఇలా చేయడం ద్వారా శాసనవ్యవస్థతో ఘర్షణకు దిగుతున్నట్లు భావించాల్సిన అవసరం లేదన్నారు. ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు ఫారం–1 నోటీసులిచ్చే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం గడువునిస్తున్నామని, ఈ కేసులో కోర్టుకు సహకరించాలని ఇరుపక్షాలకు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment