
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ బహిష్కరణ తీర్మానాన్ని రద్దు చేస్తూ, వారి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభేనని శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు తీర్పు మేరకు కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల పునరుద్ధరణ అనేది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారమని ఆయన తెలిపారు. అందువల్ల కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల విషయంలో తాను కోర్టు ఆదేశాలను ఏ రకంగానూ ఉల్లంఘించలేదని, కోర్టు ఆదేశాలపై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
తమ బహిష్కరణను, నియోజకవర్గాల ఖాళీ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా కూడా తమ శాసనసభ్యత్వాలను మాత్రం పునరుద్ధరించలేదని, ఇది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారమే అవుతుందని, అందువల్ల అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు తమ వాదనలను వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేశారు.
ఆ అధికారం సభకే ఉంది
శానససభ చేసే తీర్మానాల విషయంలో శాసనసభ కార్యదర్శికి రాజ్యాంగం ప్రకారం ఎటువంటి పాత్ర లేదని నరసింహాచార్యులు తన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఏదైనా విషయంపై చర్చ జరిపి, నిర్ణయం తీసుకునే అధికారం సభకు మాత్రమే ఉందన్నారు. శాసనసభ సభ్యుల హక్కులు, వారికున్న రాజ్యాంగపరమైన రక్షణ విషయాలన్నీ కూడా సభ పరిధిలోనివేనన్నారు. సభ్యుల వ్యవహారశైలిపై నిర్ణయం సభదే అవుతుందని తెలిపారు. సభ తీర్మానం మేరకు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలను రద్దు చేసి వారి పేర్లను జాబితా నుంచి తొలగించామన్నారు. హైకోర్టు ఆదేశాలతో తమ పేర్లను జాబితాలో చేర్చాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరారని, దీనిపై సభే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తన కౌంటర్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తాను ఎక్కడా కూడా ఉల్లంఘించలేదన్నారు.
అనవసరంగా వివాదంలోకి లాగారు
ఈ మొత్తం వ్యవహారంలో తనపై ఎటువంటి ఆరోపణలు లేవని న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తన కౌంటర్‌లో వివరించారు. కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల రద్దుతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సభలో తీసుకున్న నిర్ణయాలకూ తనకూ సంబంధం లేదని వివరించారు. ఈ మొత్తం వివాదంలో అనవసరంగా తనను లాగారని తెలిపారు. కేవలం తాను న్యాయశాఖ కార్యదర్శినే కాక బాధ్యతాయుతమైన న్యాయాధికారిని కూడానని వివరించారు. కాబట్టి కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం అన్నదే ఉండదన్నారు. అందువల్ల తనపై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను మూసేయాలని కోరారు. కాగా కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది.