ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు
► ఒంగోలు, శ్రీకాకుళంలో ఏర్పాటు
► వారం రోజుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
► రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు
అమరావతి : ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తగా మరో రెండు ట్రిపుల్ ఐటీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఒంగోలు, శ్రీకాకుళంలలో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయనుందని, ఆ వెంటనే ఈ రెండు కేంద్రాలకు సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ట్రిపుల్ ఐటీలకు మంచి స్పందన ఉందని, ఇందులో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల్లో 60 శాతం మందికి క్యాంపస్ నియామకాలు లభిస్తున్నాయన్నారు. దీంతో మరో రెండు కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ విద్యాసంవత్సరానికి ఒంగోలు కాలేజీకి ఎంపికైన వారికి ఇడుపులపాయలో, శ్రీకాకుళం కళాశాలకు ఎంపికైన వారికి నూజివీడులో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆగస్టు 1 నుంచి తరగతులు
నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం 15,974 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 13,546 అర్హమైనవిగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయించి నూజివీడు కాలేజీకి 1,230 మందిని, ఇడుపులపాయకు 721 మందిని ఫేజ్1లో ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కాలేజీలకు జూలై 20 నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఫేజ్2 జాబితాను జూలై 23న విడుదల చేసి వారికి కౌన్సెలింగ్ 29తో పూర్తి చేస్తామన్నారు. జూలై 30లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు.
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, ఫార్మసీ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ నెల 27 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఫీజుల నిర్ణయంపై ఆలస్యం కావడంతో జూలై 1కి వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. కొత్తగా నిర్ణయించిన కాలేజీ ఫీజుల వివరాలు శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఫీజుల ఆధారంగా వెబ్ ఆప్షన్‌లో కాలేజీలను మార్చుకోవడానికి జూన్ 26 సాయంత్రం ఆరుగంటల వరకు సమయాన్ని ఇచ్చారు. జూన్ 27 ఉదయం 8 గంటల నుంచి సీట్ల కేటాయింపు మొదలై జూన్ 28 మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తవుతుందన్నారు. అదేరోజు సాయంత్రానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తామని, జూన్ 29న నుంచి విద్యార్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు.