► మరో ఇద్దరిని మింగేసిన కెరటాలు
► రుషికొండ వద్ద మళ్లీ విషాదం
► మృతులు హైదరాబాదీలు
అలల నవ్వులతో అందంగా కనిపించే కడలి మళ్లీ పంజా విసిరింది. కెరటాల మాటున దాగిన మృత్యువు మరో ఇద్దరు యువకుల ప్రాణాలను మింగేసింది. సంద్రాన్ని చూసి ఉప్పొంగిన సంతోషంతో స్నానానికి వెళ్లిన వారిని ఆపద అమాంతం కబళించింది. ఆదివారం నాడు అందమైన రుషికొండ తీరంలో అలలతో ఆటలాడుదామనుకుంటే.. జీవితమే అర్థాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ నుంచి పని కోసం వచ్చి.. సెలవు రోజున సరదాగా గడుపుదామ నుకుంటే.. శాశ్వత విషాదం సంప్రాప్తమైంది. ఆరుగురు యువకులబృందంలో నలుగురు మత్స్యకారుల తెగువతో కెరటాల కాటు నుంచి బయటపడగా, ఇద్దరికి మాత్రం ఆపాటి అదృష్టం లేకుండా పోయింది. వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో శోక సంద్రం ఉప్పొంగిపోయింది.
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : రాకాసి అలలకు ఇద్దరు యువకులు బలైపోయారు. ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి విశాఖ నగరానికి వచ్చిన రాహుల్ ఉపాధ్యాయ(33), నావల్‌పాండ్య (25) కెరటాలకు చిక్కి విగతజీవులయ్యారు. సరదాగా తీరంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురిలో ఐదుగురు తీరంలో గల్లంతవగా... ఒడ్డునే ఉన్న స్నేహితుడి సమాచారంతో స్థానిక మత్స్యకారులు ముగ్గురిని సురక్షితంగా రక్షించగలిగారు. వారంతా ప్రస్తుతం గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరూ విగత జీవులయ్యారు.
వీరిలో నావల్ పాండ్య అనే యువకుడిని కొన ఊపిరితోనే ఒడ్డుకు చేర్చామని... ఆ క్షణంలో వైద్యం అందితే బతికేవాడని మత్స్యకార యువకులు ఆర్.పెదకొండ, టి.సతీష్, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన యూషఫ్, హైదరాబాద్‌కు చెందిన అక్బర్, హుస్సేన్, మోహిజ్, రాహుల్ ఉపాధ్యాయ, నావల్ పాండ్య డైమాండ్ పార్కు సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన కరాచీ బేకరీలో పనిచేస్తున్నారు. వీరంతా కరాచీ బేకరీ రీ మోడలింగ్ చేస్తూ మురుళీనగర్‌లో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు.
ఆదివారం సెలవు కావడంతో ఉదయం 6.30 గంటలకు రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. సాయిప్రియ రెసిడెన్సీ వెనుక తీరంలో ఐదుగురు సముద్రంలో దిగి స్నానాలు చేస్తుండగా ఉధృతమైన అలలకు వారంతా గల్లంతయ్యారు. వెంటనే ఒడ్డున ఉన్న యూషఫ్ మెరైన్ టవర్ వద్ద ఉన్న మత్స్యకార యువకులకు సమాచారం అందించాడు. దాంతో ఆర్.పెదకొండ, టి.సతీష్, ఎద్దిపల్లి అప్పన్న, గద్దిపల్లి దుర్గ పరిగెత్తుకుంటూ వచ్చి మునిగిపోతున్న అక్బర్, హుస్సేన్, మోహిజ్‌లను రక్షించారు. అప్పటికే కనిపించకుండా పోయిన వారిలో నావల్ పాండ్యను కొన ఊపిరితో ఒడ్డుకు చేర్చినా ప్రయోజనం లేకపోయింది.
మరోవైపు రాహుల్ ఉపాధ్యాయ చనిపోయి తేలడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం తెల్లవారుజామునే జరగడంతో ఆ సమయంలో లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో మత్స్యకార యువకులే ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు, ఎస్‌ఐ సంతోష్, పీఎం పాలెం ఎస్‌ఐ కె.శ్యామ్‌సుందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
డేంజరస్ జోన్
రుషికొండ తీరం, సాయిప్రియ రెసిడెన్సీ వెనుక ప్రాంతాలు రిప్ కరెంట్ జోన్ (భయంకరమైన కెరటాలు వచ్చే జోన్)గా ప్రకటించినా సందర్శకులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ప్రాంతంలో ఈత కొట్టడం ప్రమాదకరమని తెలిసినా స్నానాలకు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పహారా కాసే లైఫ్ గార్డులు, పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు రుషికొండ తీరంలో ఎక్కడా జీవీఎంసీ గాని, పోలీసులు గాని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు హుద్‌హుద్ తుఫాన్ సమయంలో కూలిపోయాయి. వాటి స్థానంలో మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సందర్శకులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్, నవీన్ మంచి స్నేహితులు
హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన రాహుల్ ఉపాధ్యాయ, నావల్ పాండ్య మంచి స్నేహితులు. వీరిద్దరూ కరాచీ బేకరీ రీ మేకింగ్ కోసం రెండేళ్ల కిందట విశాఖపట్నం వచ్చారు. ప్రతీ వారం రుషికొండ బీచ్‌కు వస్తుంటాం. ఈ వారం ఇలా జరిగింది. ఎంతో హుషారుగా అందరితో కలిసిపోయేవారు. వీరిలో నవీన్‌కు ఏడాది కిందటే వివాహం జరిగింది. – లోకేష్, కరాచీ బేకరీ ఉద్యోగి
కళ్లెదుటే జరిగిపోయింది
ఐదుగురు లోపలకు దిగి స్నానాలు చేస్తుండగా రాహుల్, నావల్ ఒక్కసారిగా కన్పించలేదు. మిగిలిన అక్బర్, హుస్సేన్, మోహిజ్ కంగారుపడిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి వెంటనే మెరైన్ టవర్ వద్ద ఉన్న మత్స్యకారులను రక్షించమని వేడుకున్నాను. వారు ప్రయత్నించి ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. కొన ఊపిరితో నావల్ పాండ్యను ఒడ్డుకు చేర్చినా ఫలితం లేకపోయింది. –యూషఫ్, మృతుల సహ ఉద్యోగి
వెళ్లొద్దని చెప్పినా వినలేదు
స్నానాలు చేయడానికి ఆ తీరం వైపు వెళ్లవద్దని యువకులకు చెప్పినా వారు వినలేదు. సముద్రంలోకి దిగి కెరటాలు కబళిస్తుంటే వారిలో ఒకరు పరుగున వచ్చి రక్షించమని అడిగారు. వెంటనే వెళ్లి సాధ్యమైనంతవరకు ముగ్గురిని రక్షించాం. మిగితా ఇద్దరినీ రక్షించలేకపోయాం.
– టి.సతీష్, రుషికొండ, మత్స్యకార యువకుడు