తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ‘చిల్లర రాజకీయాలు’ సహజమే! | Ksr Comments On The Way TDP Is Dealing With The Buildings Constructed On Rushikonda In Visakhapatnam | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ‘చిల్లర రాజకీయాలు’ సహజమే!

Published Thu, Jun 20 2024 11:11 AM | Last Updated on Thu, Jun 20 2024 11:18 AM

Ksr Comments On The Way TDP Is Dealing With The Buildings Constructed On Rushikonda In Visakhapatnam

కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఏపీలో తెలుగుదేశం తీరు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన రుషికొండపై గత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వం నిర్మించిన భవనాలపై వివాదం రేపుతున్న వైనం అల్ప బుద్ధిని చాటుతోంది తప్ప ఇంకొకటి కాదని చెప్పాలి. విశాఖపట్నానికి శిఖరాయమానమైన, బ్రహ్మండమైన భవంతులను నిర్మాణం అయినందుకు సంతోషించవలసిందిపోయి, ఈ రకంగా బురదచల్లడం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు. అత్యంత నాణ్యమైన రీతిలో చక్కని భవంతిని నిర్మించడం కూడా తప్పేనని తెలుగుదేశం చెబుతోంది.

రుషికొండపై నిర్మితమైన ఈ ప్రాజెక్టు, అక్కడ ఉన్న పార్కు ప్రదేశం తదితర విశేషాలను టీవీలలో చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ముఖ్యమైన అతిధులు అక్కడకు వస్తే, వారు ఆ భవనాలలో బస చేస్తే ఎంతో గొప్ప పేరు వస్తుంది. ఎదురుగా సముద్రతీరం. కొండమీద సురక్షితమైన ప్రదేశంలో భవనాల నిర్మాణం వల్ల దేశం అంతటిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. విశాఖలో టూరిజం అభివృద్దికి కూడా ఇది మరింత దోహదపడుతుంది. ఇదే తరహాలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక భారీ భవనం నిర్మించి ఉంటే, అబ్బో ఎంత గొప్పగానో ప్రచారం చేసి ఉండేది. వారు అలా చేయలేకపోయారు కాబట్టి ప్రజలలోకి తప్పుడు సంకేతం తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ బురద చల్లుడు కార్యక్రమం జరిగింది. ఈ భవనం అంతా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు సంబంధించిందేమో అనే అనుమానం కలిగేలా ప్రచారం చేశారు. నిజానికి అది టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం. అక్కడ దానిని టూరిజం ప్రాజెక్టుగా వాడుకుంటారా? లేక ముఖ్యమంత్రి బసకు వాడుకుంటారా? అనేది ప్రభుత్వం ఇష్టం. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినప్పుడు రుషికొండపై బస చేస్తే ఏపీకి ఎంతో గౌరవం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఆ భవనాలను దేనికి వినియోగించుకుంటారో చెప్పాలి కదా! వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వం నిర్మించింది కనుక తాము ఆ భవనాలను వాడబోమని అంటారా! వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వం ఏమీ అక్కడ తాత్కాలిక భవనాలను నిర్మించలేదు. శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగపడేలా నిర్మించారు.

అదే అమరావతి రాజధాని ప్రాంతంలో 2014-2019 మధ్యచంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనాలను నిర్మించి ఎన్ని వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందన్న అంశం గురించి టీడీపీ నేతలు మాట్లాడే పరిస్థితి లేదు. సచివాలాయం, శాసనసభ భవనాలన్నిటిని తాత్కాలిక ప్రాతిపదికనే వందల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ భవనాల నిర్మాణంలోకానీ, ఇతరత్రా కానీ రెండువేల కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీటీడీ ప్రకటించింది. దానిపై టీడీపీ నేతలు వివరణ ఇస్తే బాగుంటుంది. అధికారం వచ్చింది కనుక అన్నీ తూచ్ అని చెప్పవచ్చు. కేంద్రంలో తమ కూటమి పవర్ లో ఉంది కనుక అన్నిటినీ తప్పించుకోవచ్చు. కానీ చరిత్ర ఎప్పటికి కనుమరుగు కాదు కదా!

దీని సంగతి పక్కనబెడితే ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పలు గ్రాఫిక్స్ ను ప్రచారంలోకి తెచ్చింది. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం ఎలా జరుగుతుంది? శాసనసభ ఏ రూపంలో ఉంటుంది? సచివాలయం ఎన్ని అంతస్తుల టవర్ లో ఉంటుంది?మొదలైన వాటిపై తెలుగుదేశం మీడియాలో ఎన్నో కథనాలు వచ్చేవి. అవి చూస్తే ఇంత అధ్బుతంగా ఇక్కడ భవనాలు నిర్మించబోతున్నారా అనే చందంగా ప్రచారం జరిగేది. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన డిజైనింగ్ నిపుణులతో ప్లానింగ్ చేశామని చెప్పేవారు. అసెంబ్లీ భవనం ఒకసారి ఇడ్లీ పాత్ర షేప్ లో ఉంటుందని, మరోసారి ఇంకో రకంగా ఉంటుందని రకరకాల డిజైన్ లను ప్రచారంలోకి తెచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేసేవారు. వాటన్నిటిని ఏమని అంటారు. అవన్ని చంద్రబాబు నాయుడు సొంత భవనాలు కాదు కదా!  రాజధాని కోసం ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టినవే కదా! అప్పుడేమని ప్రచారం చేశారు! చంద్రబాబు కాబట్టి అంత విజన్ తో మంచి డిజైన్లతో భారీ భవనాలను నిర్మిస్తున్నారని కదా చెప్పింది. 

అదే తరహాలో విశాఖలో మంచి ఆకృతితో కొన్ని భవనాలు నిర్మిస్తే టీడీపీ నేతలకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటో తెలియదు. అందులో అవకతవకలు జరిగాయని వారు చెప్పడం లేదు. భారీ వ్యయంతో నిర్మాణాలు జరిగాయని అంటున్నారు. విశాఖకు అది ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది వారు చూడడం లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంకు మంచి పేరు రావడం ఇష్టం లేదు కనుక వారు అదేదో కనిపెట్టినట్లు అక్కడ గదులు అలా ఉన్నాయి.. హాల్ అలా ఉంది.. ఇలా ఉంది.. అంటూ విమర్శలు చేశారు.

ఇంతకీ ఆ భవనాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వాడుకునేది మాత్రం చెప్పలేదు. రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న సమయంలో దానికి అడ్డు తగలడానికి టీడీపీకానీ, ఆ పార్టీ మీడియా కానీ చేయని ప్రయత్నం లేదు. అయినా రాష్ట్రానికి ప్రయోజనం, విశాఖకు మకుటంలా ఉంటుందని పట్టుదలతో ఆ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లోని సచివాలయంలో తన చాంబర్ ను ఎన్ని కోట్లతో అభివృద్ది చేశారో చెప్పగలరా! దానిని మూడునాళ్ల ముచ్చటగా ఎందుకు మార్చారో వివరించగలరా! అదొక్కటే కాదు. 

వందల కోట్ల విలువైన హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఎందుకు పాడుపెట్టారో తెలపగలరా?. అప్పట్లో జూబ్లిహిల్స్ లో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నందున వేరే ఇంటిలో ఉండడానికి ఎంత వ్యయం చేశారు. పార్క్ హయతోలో తన కుటుంబం కోసం తీసుకున్న సూట్ ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయింది. దీనిపై అప్పటి  బీజేపీ నేత, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఏమని ఆరోపించింది గుర్తు చేసుకోగలరా? ముప్పై కోట్ల ఇందుకు వ్యయం చేశారని ఆయన అనేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌పై విశాఖ రుషికొండ భవంతి విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి బదులుగా వైఎస్సార్‌సీపీ అభిమానులు సోషల్ మీడియాలో టీడీపీ వారిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చారు కనుక మరింత బాధ్యతతో వ్యవహరించి పేరు తెచ్చుకుంటే మంచిది.

తెలంగాణలో గత ప్రభుత్వ నేత కేసీఆర్ సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పించేవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవే సచివాలయ భవనాలను వాడుకుంటున్నారు. ఆ సదుపాయాలను వారు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నిర్మించిన ప్రగతి భవన్ పై కూడా అప్పట్లో చాలా వ్యతిరేక ప్రచారం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లని, అదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని ప్రజాభవన్ గా మార్చామన్నారు. అంతే తప్ప నిజంగానే బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లు ఉన్నాయో, లేదో ఇంతవరకు ప్రజలకు వివరించలేదు.

ఆ రోజుల్లో కేసీఆర్ కు మద్దతు ఇచ్చిన ఈనాడు తెలంగాణ సచివాలయం అంత గొప్పగా ఉంది.. ఇంత గొప్పగా ఉంది అంటూ సచిత్ర కథనాలను ఇచ్చింది. విశాఖ భవనాలపై మాత్రం టీడీపీ మీడియా విషం చిమ్ముతోంది. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి పూనుకొన్నప్పుడు విపక్షాలు విమర్శలు చేశాయి. చివరికి కోర్టుకు కూడా వెళ్లాయి. కానీ ఆ భవనాన్ని భారీ ఖర్చుతో మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తర్వాత విమర్శలు ఆగిపోయాయి. రాజకీయాలలో ఇలాంటివి కామన్ గానే జరుగుతుంటాయి.

అమరావతి రాజధానికోసం మూడు దశలలో లక్ష కోట్ల వ్యయం చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. తొలిదశలోనే నలభైఎనిమిదివేల కోట్లు పెడతామని అంటున్నారు. అంత వ్యయం ఓకే చోట పెట్టడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఊరుకునే పరిస్థితి లేదు. అదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ అని విమర్శలు వచ్చేవి. అలాంటి చోట్ల లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న తెలుగుదేశం నేతలు, విశాఖపట్నం నగరానికి మరింత ఘనత తెచ్చేలా భవనాలు నిర్మిస్తే దుమారం లేవదీస్తున్నారు. ఇదేకాదు.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ ఫర్నీచర్ పై కూడా వివాదం చేయడం పద్ధతిగా లేదు. అంతా కలిపి ప్రభుత్వం మారి వారం రోజులు కాలేదు.. అప్పుడే ఫర్నీచర్ అందచేయలేదని వీరు ఆరోపించారు.

గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని అసెంబ్లీ పర్నీచర్ ను తన కుమారుడి షాప్ లో పెట్టుకుంటే తప్పు కాదట. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఆ ఫర్నిచర్ కు ఎంత బిల్లు అవుతుందో చెబితే చెల్లిస్తామని లేఖ రాస్తే తప్పట. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌పై ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ నిరంతరం పనిచేయడానికి పూనుకుంటున్నట్లుగా ఉంది. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టం కనుక ఏదో ఒక చిల్లర వివాదం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ నేతలు ఇలాంటివి చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అందుకే కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని చెప్పాల్సి వస్తోంది.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement