రౌడీల బీభత్సం కేసులో 20 మంది అరెస్టు
Published Fri, Dec 2 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు
పరారీలో ప్రధాన నిందితుడు తోట బాబితో సహా మరో 11 మంది
మారణాయుధాలు, గునపాలు, సమ్మెటలు స్వాధీనం
అమలాపురం టౌను:
అమలాపురంలో ఓ ఇంటిని, అందులోని ప్రింటింగ్ ప్రెస్‌ను ధ్వంసం చేసిన కేసులో 20 మంది నిందితులను పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఈనెల 16 వరకూ రిమాండు విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్‌కు తరలించారు. అరెస్ట్‌కు ముందు డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్‌కే శ్రీనివాస్, జి.దేవకుమార్‌లు, ఎస్సైలు నిందితులను, వారి నుంచి స్వాధీనం చేసుకున్న రెండు ఇన్నోవా కార్లు, మారణాయుధాలు, గునపాలు, సమ్మెటలను విలేకర్లకు చూపించారు. పోలీసులు మొత్తం 31 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో ప్రధాన నిందితుడైన తోట పుండరీకాక్షుడు అనే బాబితో పాటు మరో పది మంది పరారీలో ఉన్నారు. ఘటన స్థలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న 20 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. డీఎస్పీ అంకయ్య ఆ 20 మంది పేర్ల జాబితాను విలేకర్లకు విడుదల చేశారు. కాకినాడ ప్రాంతానికి చెందిన యాళ్ల రాజు (రౌడీ షీటర్), వాసంశెట్టి శ్రీనివాస్, బళ్ల సూరిబాబు, పోలిశెట్టి సురేంద్రకుమార్, ఎలిపే మేఘ శ్యామ్, షేక్ అల్థాఫా, అయినవిల్లి వీర్రాజు, సూరంపూడి సురేష్, లూటుకుర్తి మోహనరావు, తలారి సుబ్రహ్మణ్యం, చాపల జయానందరాజు, కాండ్రేగుల రంగారావు, కొండెల బంగార్రాజు, అమలాపురానికి చెందిన గూడా శ్రీరామాంజనేయులు, గూడా వెంకట రమణ సీతారామాంజనేయులు, గూడా రాధాకృష్ణ నరసింహ సీతారామాంజనేయులు, గంగవరం మండలం వెంకటాయపాలేనికి చెందిన తోట తేజోమూర్తి, అమలాపురానికి చెందిన ఉపాధ్యాయుడు ఆచంట వీర వెంకట సత్యనారాయణమూర్తిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ అంకయ్య వెల్లడించారు.
ఒకే ఆస్తికి రెండు రిజిస్ట్రేషన్లపై ఆరా
గూడా రామాంజనేయులుకు చెందిన ఇంటిని సగం విక్రయం ద్వారా ప్రింటింగ్ ప్రెస్ యాజమాని కాళ్లకూరి బుజ్జికి పక్కాగా రిజిస్టర్ చేశారు. అదే ఆస్తిని రామాంజనేయులు సోదరులు, సోదరి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆచంట వీర వెంకట సత్యనారాయణ పేరున ఎలా రిజిస్టర్ చేశారన్న విషయాన్ని, అలాగే ఆయన నుంచి తోట తేజోమూర్తికి అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలా రిజిస్టర్ చేశారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది అంబాజీపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌పైనా డీఎస్పీ లంక అంకయ్య ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకునేలా అతనిపై పోలీసులు జిల్లా విద్యా శాఖకు లేఖ రాశారు. మారణాయుధాలు, హత్యాయత్నం కేసులో ఇప్పటికే ఉపాధ్యాయుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయనను విద్యా శాఖ సస్పెండ్ చేయనుంది.
Advertisement