20 వేల పక్కాగృహాలు మంజూరు
-
నిర్దేశించిన ధరకే ఇటుకలు సరఫరా చేయాలి
-
కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట): జిల్లాకు ప్రభుత్వం 20వేల పక్కాగృహాలు మంజూరు చేసిందని, పక్కాఇళ్ల నిర్మాణాలకు నిర్దేశించిన ధరకే సకాలంలో ఇటుకలు సరఫరా చేయాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఇటుక బట్టీల యాజమానులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులు, ఇటుక బట్టీల యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఇటుక బట్టీలకు అవసరమైన మట్టిని చెరువుల నుంచి తరలించుకునేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, కార్మికశాఖ, గృహనిర్మాణ సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి మార్చిలోగా గృహనిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీనివాసరావు, ఆత్మకూరు, గూడూరు ఆర్డీఓలు రమణ, వెంకటసుబ్బయ్య, డ్వామా పీడీ హరిత, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీల నిధులతో మౌలిక వసతులు
ఎంపీల నిధులతో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ఎంపీల నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఓ మూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఆర్వీ కృష్ణారెడ్డి, పీఆర్ ఎస్‌ఈ బుగ్గయ్య, తదితరులు పాల్గొన్నారు.