2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి
దేవరకొండ
ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఐబీ ఆవరణలో జరిగిన రైతుల, ప్రాజెక్టుల భూనిర్వాసితుల సమస్యలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులు ఆ భూమే పోతే రైతు జీవితం పోయినట్లేనని, రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటున్న ప్రభుత్వం జీఓ నంబర్ 123ను రద్దు చేసి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యాన్ని ప్రాథమిక హక్కుగా ప్రతి ఒక్కరికి అందించాల్సి ఉండగా అవి నేడు ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారని అలాంటి ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుందన్నారు. భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తమకు ఓట్లేసి గెలిపించిన జనాన్ని మరిచిపోయారని ఆరోపించారు. ప్రజలను ఎవరైతే హీనంగా చూస్తారో వారిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌ల చుట్టూ హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను కొనుగోలు చేసి సొంత పార్టీలో చేర్చుకున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలబడతారన్నారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర కోశాధికారి పోలె విష్ణు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో తెలంగాణ నవనిర్మాణ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మురళీధర్‌గుప్తా, రాంనర్సయ్య, రైతు సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల శ్రీనివాస్‌యాదవ్, సమితి రాష్ట్ర కార్యదర్శి ఆకుల భిక్షపతి, నల్లగంటి రామకృష్ణ, లొడంగి గోవర్ధన్‌యాదవ్, సమితి జిల్లా బాధ్యులు ఎర్ర విజయ్‌కుమార్, జిల్లా బాధ్యులు ఎర్ర కృష్ణ, రమేష్, తిరుపతి తదితరులున్నారు.