మూడేళ్లలో ... ముప్పై మంది మృతి
సకాలంలో వైద్యం అందక రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మృత్యువాత పడుతున్నారు. పోలీస్ రికార్డులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ముప్పై మంది మృతి చెందారు. అంటే ఏడాదికి పది మంది చొప్పున అసువులు బాస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సకాలంలో ఆసుపత్రులకు తీసుకువెళ్లకపోవడమే.
-
సకాలంలో అందని వైద్యం
-
మృతి చెందుతున్న ఖైదీలు
-
జైలు ఆవరణలో ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితం
రాజమహేంద్రవరం క్రైం:
సకాలంలో వైద్యం అందక రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మృత్యువాత పడుతున్నారు. పోలీస్ రికార్డులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో ముప్పై మంది మృతి చెందారు. అంటే ఏడాదికి పది మంది చొప్పున అసువులు బాస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సకాలంలో ఆసుపత్రులకు తీసుకువెళ్లకపోవడమే.
కనీస సౌకర్యాలు కరువు...
రెండు వేల మందికిపైగా ఖైదీలున్న ఈ కారాగారంలో ఉన్న ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలానే పైపై వైద్యానికే పరిమితమవుతోంది. ఖైదీల ఆరోగ్యం విషమించిందంటే రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందే. అక్కడ పరిస్థితి విషమిస్తే కాకినాడ ప్రభుత్వ హాస్పటల్‌కు రిఫర్ చేస్తారు. ఇక్కడా చేయి దాటిపోతే హైదాబాద్‌కు పంపించేవారు. రాష్ట్ర విభజన తరువాత విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఈ జాప్యం కారణంగా ఖైదీలు అర్థంతరంగానే మరణిస్తున్నారు.
50 పడకల ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితం...
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీలకు వైద్య చికిత్సలు అందించేందుకు రూ.10 కోట్లతో 50 పడకల ఆసుపత్రిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు న్నాయి. అయితే ఈ నిధులు నెల్లూరు జైలుకు తరలించడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఎస్కార్ట్ కోసం పడిగాపులు...
జైల్ నుంచి బయటకు తెచ్చి ఆసుపత్రికి తరలించాలంటే నిబంధనలు పాటించాల్సిందే. జైలు సిబ్బంది కాకుండా సివిల్ పోలీసుల ఎస్కార్ట్‌తో ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. ఇందుకోసం ఖైదీ వివరాలతో ఎస్పీకి లేఖ రాసి అనుమతి తీసుకోవాలి. ఈ తతంగా పూర్తయ్యే సరికి ఒకటి, రెండు రోజులు పడుతుంది. ఇవన్నీ కుదిరినా అంబులెన్స్‌లు లేకపోవడం, అవి ఉన్నా డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో రోగి రోగం విషమించి మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రత్యేక ని«ధులు కేటాయించైనా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం...
పరిస్థితిని బట్టి ప్రత్యేక నిధులు కేటాయించైనా ఖైదీలకు వైద్యం అందిస్తున్నాం. జైలు ఆవరణలోనే రూ.10 కోట్లతో ఆసుపత్రి నిర్మించాలని ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు సాకారమైతే మంచి వైద్య సేవలను అందించవచ్చు.
ఎం. వరప్రసాద్,రాజమహేంద్రవరం, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్