పవన్ కల్యాణ్ కోరినట్లే...:నారాయణ
విజయవాడ : ఈ నెల 20తో ఆంధ్రప్రదేశ్ రాజధాని ల్యాండ్ ఫూలింగ్ పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారమిక్కడ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధానికి 34 వేల ఎకరాలు సమీకరించామని, మరో 2,200 ఎకరాలు అవసరమన్నారు.
పవన్ కల్యాణ్ కోరినట్లే ఏ రైతును ఇబ్బంది పెట్టకుండా ల్యాండ్ ఫూలింగ్ చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. అయితే రైతులు భూసేకరణ కన్నా..ల్యాండ్ ఫూలింగ్కే సహకరించాలని ఆయన అన్నారు. ఈనెల 20 తర్వాత భూ సేకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాజధాని నిర్మాణ సలహా, పర్యవేక్షణ కమిటీలు సమావేశం అవుతాయని, 2019 నాటికి పూర్తి చేయాల్సిన కోర్ క్యాపిటల్ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.