రైలు ఢీకొని మృతి చెందిన గొర్రెలను చూసి నిట్టూరుస్తున్న యజమానులు
కంచిలి : మండలంలోని జాడుపూడి గ్రామ సమీపంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బుధవారం భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ ఢీకొని 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకిళ్లే.. కవిటి మండలం జి.బెలగాం గ్రామానికి చెందిన మద్దిలి భీమయ్య, మద్దిలి భీమారావు, నర్తు రామారావులకు చెందిన గొర్రెలను కాపరి మేత కోసం ఈ మార్గంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. రైలు వస్తుందని గమనించకపోవటంతో గొర్రెలను రైల్వేట్రాక్‌ను దాటిస్తుండగా రైలు ఢీకొంది. దీంతో గొర్రెలు రైలు వేగానికి చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. విషయం తెలుసుకొన్న యజమానులు సంఘటనా స్థలానికి వచ్చి గుండెలవిసేలా కన్నీరుమున్నీరయ్యారు. పేదలమైన∙తాము తమకున్నదంతా గొర్రెల పెంపకం కోసమే పెట్టామని, తీరా ఇవి చనిపోవటంతో కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమాచారం తెలుసుకొన్న తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 52 గొర్రెలు ఈ ప్రమాదంలో మృతి చెందాయని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు.