విశాఖపట్నం: విశాఖలో చిన్నారి(6) అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని దేవరాపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి దివ్య మంగళవారం స్కూలుకు వెళ్లింది. అయితే సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చిన్నారి కోసం తెలిసిన వారి ఇళ్లల్లో, బంధువుల దగ్గర వాకబు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేం లేక కుమార్తె అదృశ్యంపై కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిన్న స్కూలుకు వెళ్లిన తమ చిన్నారి దివ్య ఇప్పటివరకూ ఇంటికి తిరిగిరాలేదంటూ తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య మేనమామ శేఖర్ను అనుమానిస్తున్నారు. దాంతో అతడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవరాపల్లిలో పాప ఆచూకీ కోసం జాగిలాలతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.