‘ఓటె’త్తిన ఖేడ్: 81.79 శాతం పోలింగ్
♦ 81.79 శాతం పోలింగ్
♦ ప్రశాంతంగా ముగిసిన నారాయణఖేడ్ ఉప ఎన్నిక
♦ ఖేడ్ చరిత్రలో అత్యధిక ఓటింగ్
♦ విధి నిర్వహణలో కానిస్టేబుల్‌కు రక్తపోటు.. మృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 81.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్‌రాస్ శనివారం ప్రకటించారు. నారాయణఖేడ్ చరిత్రలో అత్యధిక ఓటింగ్ ఇదే కావడం గమనార్హం. గత సాధారణ ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదైంది. వలస ఓటర్లు వెల్లువలా తరలిరావడంవల్లే ఓటింగ్ భారీగా పెరిగింద న్నది విశ్లేషకుల అంచనా. పోలింగ్ మొదట్లో కొంత మందకొడిగా సాగినా.. 10 గంటల తరువాత వేగం పుంజుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓటర్ల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా ఊపందుకుంది.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 58.43 శాతం నమోదు కాగా, 3 గంటలకు 73.47 శాతానికి చేరింది. సాయంత్రం 5గంటలకు 81.79శాతం నమోదైంది. నియోజకవర్గంలోని 168 గ్రామాల్లో 1.89 లక్షల ఓట్లు ఉండగా, 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చే శారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో పొరపాట్లు దొర్లడంతో ఓట్లు గల్లంతయ్యాయి. నారాయణఖేడ్ మండలంలోని గౌరారం తండాలో ఎన్నికల సిబ్బందికి 2015నాటి ఓటరు లిస్టు, ఏజెంట్లకు 2016 ఓటరు లిస్టు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. ఇక్కడ 60 మంది ఓట్లు గల్లంతయ్యా యి. నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్‌పల్లిలో తమ ఓట్లు తీసేశారని 80మంది ఆం దోళనకు దిగారు. దాదాపు 15 గ్రామాల్లో ఈతరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.
తొలి ఓటరుకు పువ్వుతో స్వాగతం
నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ మోడల్ పోలింగ్ కేంద్రంలో సోనిబాయ్ ఓటుతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెకు అధికారులు గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతం పలికారు. మొత్తం 20 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి మహారెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి కల్హేర్ మండలం ఖానాపురంలో, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి మంగల్‌పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా కొండాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హీరాసింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ రక్తపోటు పెరగడంతో కిందపడిపోయారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందారు. హీరాసింగ్ పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నట్లు డీఎస్పీ తిరపతన్న తెలిపారు.
16న కౌంటింగ్
నారాయణఖేడ్ మండలం జూకల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈవీఎంలు ఇక్కడకు చేరుకున్నాయి. వీటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి భారీ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్ వెల్లడించారు.
వెల్లువలా వలస కూలీలు
నియోజకవర్గంలో మొత్తం 1,88,839 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు 1.37 లక్షల మందికి మాత్రమే ఓటరు స్లిప్పులు అందించారు. మిగిలిన 51 వేల మంది ఓటర్ల ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వీరంతా వలస కూలీలని, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ రోజున వలస కూలీలు వెల్లువలా వచ్చారు. హైదరాబాద్, బీదర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. 51 వేల మందిలో 50 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అంచనా.