జిల్లాలో 83 ‘స్వచ్ఛ’ గ్రామాలు
సెర్ప్ ప్రతినిధి బాలకృష్ణన్
జగదేవ్‌పూర్: రాష్ర్టంలో 2019 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి లోగా తెలంగాణలోని ప్రతి పల్లెను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ(సెర్ప్) లక్ష్యమని సెర్ప్ ప్రతినిధి బాలకృష్ణన్, తెలంగాణ పల్లె ప్రగతి ప్రతినిధి సాయిలు అన్నారు. సోమవారం తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అమీర్‌తో కలిసి మండలంలోని రాయవరంలో మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో పర్యటిస్తూ మరుగుదొడ్ల నిర్మాణం, స్థితిగతులను ఆడిగి తెలుసుకున్నారు. మండల వెలుగు ఎపీఎం అనంద్, రాజులు వారికి పూర్తి వివరాలను వివరించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. అనంతరం సెర్‌ప ప్రతినిధి బాలకృష్ణన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 150 మండలాల్లో 2,879 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 253 గ్రామ పంచాయతీల్లో వందశాతం సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. జిల్లాలో 17 మండలాల్లో 342 గ్రామాలను పల్లె ప్రగతి కింద ఎంపిక చేశామన్నారు.
నేటి వరకు 83 గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామని తెలిపారు. మిగతా గ్రామాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని చెప్పారు. మానవ అభివృద్ధే సెర్‌ప లక్ష్యమని, ఆ దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పల్లె ప్రగతి పని విధానాలపై తెలుసుకొనేందుకే రాయవరం గ్రామానికి వచ్చామన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ ప్రతినిధి జంగంరెడ్డి, యంగ్ ప్రొపేసర్ వంశీకృష్ణ, సర్పంచ్ గణేశ్, ఎంపీటీసీ బాలమ్మ, కార్యదర్శి ప్రశాంత్, ఈజీఎస్ ఎపీఓ శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.