పుష్కరాల్లో 91 మంది అదృశ్యం
33 మంది ఆచూకీ లభ్యం
రాజమండ్రి : గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు నుంచి ఆరు రోజుల పాటు వివిధ ఘాట్లు, ప్రాంతాల్లో 91 మంది అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. వారిలో 33 మంది ఆచూకీ లభించడంతో బంధువులకు అప్పగించామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు మూడు రోజుల పాటు రాజమండ్రిలోనే ఉండిపోయి, తమ బంధువుల గురించి నగరమంతా వెతుకుతున్నాడు. మూడు రోజుల అనంతరం స్థానిక ప్రజలను అడిగి తమ వారికి ఫోన్ చేయడంతో వారు నగరానికి చేరుకుని తీసుకెళ్లారు. అలాగే సోమవారం మల్లయ్య పేట దుర్గమ్మ గుడి వద్ద మూడేళ్ల పాప తప్పిపోయింది.
ఆ ప్రాంతంలో ఏడుస్తూ తిరుగుతుండడంతో స్థానికులు చేరదీసి టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించారు. ఒక పాత్రికేయుడు పాప కోసం స్థానిక దుర్గాదేవి గుడి వద్ద గల మైక్‌లో ఎనౌన్స్ చేయడంతో ఆ చుట్టుపక్కలే పాప కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు ఏడుస్తూ పాప వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
తప్పిపోయిన తమ బంధువుల కోసం పోలీసు ఫిర్యాదులు చేయకుండా వందలాది మంది వెతుకుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, లోపుకంచి గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి ఆప్పయ్య, మజ్జి చవిటమ్మ ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు. ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయని సంఘటనలు వందల్లో ఉంటాయి.