నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు | Tungabhadra Pushkars Going To Start On Today Afternoon By YS Jagan | Sakshi
Sakshi News home page

తుంగభద్రకు పుష్కర శోభ

Published Fri, Nov 20 2020 4:24 AM | Last Updated on Fri, Nov 20 2020 10:35 AM

Tungabhadra Pushkars Going To Start On Today Afternoon By YS Jagan - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ పుష్కరాలు ప్రారంభించే కర్నూలులోని సంకల్‌ భాగ్‌ ఘాట్‌ వద్ద పూర్తయిన ఏర్పాట్లు

సాక్షి, కర్నూలు : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు నేడు (శుక్రవారం) ఘనంగా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవుతాయని పండితులు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. 

కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు..
తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేళిగనూరు(నదిచాగి) వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. 156 కిలోమీటర్ల మేర మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలలో ప్రవహించాక కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నది పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక బస్‌షెల్టర్‌లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పుష్కరాల సమయంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. 

స్నానాలకు అనుమతి లేదు..
కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ–టికెట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. ఈ–టికెట్‌ వెబ్‌సైట్‌ (https://tungabhadrapushkaralu 2020.ap.gov.in)ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎమ్మెల్యేలు గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రారంభించారు.

వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర ఘాట్‌లలో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలకు, పిండప్రదానాలకు 23 ఘాట్లలో 350 మంది పురోహితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో పురోహితుడు రోజుకు 16 స్లాట్ల చొప్పున (ఒక్కో స్లాట్‌లో ఇద్దరు) పూజలు చేస్తారు. ఈ టికెట్‌ బుక్‌ చేసుకోకుండా నేరుగా వస్తే పిండప్రదానాలకు అనుమతి ఉండదు. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో నిర్వహించినట్లుగా ఇప్పుడు కూడా పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు అన్ని ఘాట్లలో గంగాహారతి ఇవ్వనున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా సంకల్‌భాగ్‌ వీఐపీ పుష్కర ఘాట్‌లో ఏర్పాట్లను మంత్రులు బుగ్గన, జయరాం, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్‌ పరిశీలించారు. 

నాడు తండ్రి.. నేడు కుమారుడు..

గత తుంగభద్ర పుష్కరాలు 2008 డిసెంబర్‌ 10న ప్రారంభమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి డిసెంబర్‌ 11న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నదికి హారతి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంకల్‌భాగ్‌ ఘాట్‌లోనే పుష్కరాలు ప్రారంభించనున్నారు. తండ్రి, తనయులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వరుస పుష్కరాలు రావడం అరుదైన ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. 

పుష్కరాలను విజయవంతం చేయాలి: వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు
కోవిడ్‌ నేపథ్యంలో కఠిన పరిస్థితుల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అత్యంత భక్తిభావంతో నిర్వహిస్తాం. ఈ–టికెట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు పిండప్రదానాలు చేసుకోవచ్చు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి. 


కేంద్ర నిబంధనలతో నియంత్రణ చర్యలు: మంత్రి వెలంపల్లి
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్లే తుంగభద్ర పుష్కరాల్లో కొన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, భక్తులు సహకరించాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. భక్తులకు ఉచితంగా అందజేసే ఈ–టికెట్‌ విధానంలో భక్తులు ఏ సమయంలో ఏ ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనే వివరాలు ఉంటాయన్నారు.

గత ప్రభుత్వ హాయాంలో గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ. వేల కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడితే, తమ ప్రభుత్వం అవసరమైన మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పూర్తిగా పొదుపుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ పుష్కరాల్లో భక్తుల పుణ్య స్నానాలకు అనుమతి తెలపలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు డిసెంబర్‌ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే.. ఆరోజు క్రిస్మస్‌ అంటూ కొందరు విమర్శలు చేయడం సరికాదని, ఆరోజు ముక్కోటి ఏకాదశి పండుగ కూడా అనే విషయం విమర్శ చేసే వారికి తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement