అల్లవరం (అమలాపురం టౌన్): అల్లవరం మండలం వైనతేయ నదీ తీరంలోని నాలుగు గ్రామాల్లో దాదాపు రూ. కోటి వ్యయంతో చేపట్టిన నాలుగు పుష్కర ఘాట్ల పనులు నూరు శాతం పూర్తికి నోచుకోలేదు. పుష్కరాల క్రతువుకు ఇక కేవలం 24 గంటలే సమయం ఉన్నా ఇవి ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అల్లవరం మండలంలోని గోడి, బెండమూర్లంక, బోడసకుర్రు, గోపాయిలంక గ్రామాల్లోని వైనతీయ నదీ తీరంలో ప్రభుత్వం ఆరునెలల కిందటే పుష్కర ఘాట్లను ఎంపిక చేసి నిధులు కేటాయించింది. బెండమూర్లంక, గోపాయిలంక గ్రామాల్లో ఘాట్ పనులు జరగుతున్నా మంగళవారం నుంచి మొదలయ్యే పుష్కరాకలు భక్తులు స్నామమాచరించే సౌకర్యం అక్కడ లేదు. పుష్కర ఘాట్ల మెట్లకు, గోదావరి నీరుకు పొంతన లేకుండా అవి నిర్మితమవు తున్నాయి.
యువకుల శ్రమదానం
ఘాట్ల వద్ద గోదావరి నీరు లేకపోవటంతో గోపాయిలంకలో యువకులే శ్రమదానం చేసి ఇసుక బస్తాలను ఘాట్‌నుంచి గోదావరి నీటి వరకూ పేర్చుతున్నారు. ఘాట్ మెట్ల నుంచి ఇసుక బస్తాలపై నడిచి వెళితేనే కాని గోదావరి స్నానమాచరించే అవకాశం లేదు. ఆదివారం సాయంత్రానికి కూడా ఈ నాలుగ ఘాట్లలో తుది మెరుగులు కాదు కదా ఇంకా మిగిలిఉన్న పనులను పూర్తి చేస్తున్నారు. బెండమూర్లంక, గోడి ఘాట్‌ల్లో పనులు మంగళవారం నాటికి పూర్తి కావటం సాధ్యం కాదని ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఆదివారం రాత్రి, సోమవారం పగలు, రాత్రి ఇలా రేయింబవళ్లు పనులు యుద్ద ప్రాతిపదిన పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇకవేళ పనులు పూర్తయినా ఆ ఘాట్లు భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా మాత్రం లేవు.
బోడసకుర్రులో మాత్రమే ఘాట్ సక్రమంగా ఉంది. ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించటం, అధికారులు తొలినుంచీ ఈ ఘాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవటం వంటి కారణాలు ఇంతటి తీవ్ర జాప్యానికి దారితీశాయి. 20 రోజుల కిందట బెండమూర్లంక ఘాట్ పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పుష్కరాల ప్రత్యేక అధికారి ధనుంజయరెడ్డి, ఎమ్మెల్మే ఆనందరావులు సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అయినా ఆ కాంట్రాక్టర్ తీరులో మార్పులేదు.
నాణ్యతకు తిలోదకాలు
అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద అల్లవరం మండలంలోనే నాలుగు ఘాట్లు ఉన్నాయి. అమలాపురం రూరల్ మండలంలో ఒకటి ఉన్నా ఈ నాలుగు ఘాట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఘాట్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదు. టీడీపీ ప్రభుత్వంలో మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర నాయకులు మండలంలోని ఘాట్లలో అవినీతి, నాణ్యతాలోపాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
బెండమూర్లంకలో..
బెండమూర్లంక ఘాట్‌ను రూ. 40 లక్షలుతో నిర్మిస్తున్నా అందులో రూ. 10 లక్షల వరకూ అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం బహిరంగంగా ఆరోపించడం గమనార్హం. రూ.23 లక్షలతో నిర్మిస్తున్న గోపాయిలంక ఘాట్ వల్ల భక్తులకు ప్రయోజనం సున్నా. రూ. కోటి విలువైన నాలుగు ఘాట్ల పనులను తూతూ మంత్రంగా, మసి పూసి మారేడకాయ అన్నట్లుగా కంటి తుడుపు చర్యలుగా ముగించేస్తున్నారు.